IIIT students protest: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారు. దీంతో.. అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో తమ ఆందోళన విరమించారు. నేటి నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. చర్చల అనంతరం మంత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రాత్రి 9.30 నుంచి రెండున్నర గంటలకుపైగా ఈ చర్చలు జరిగాయి. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ తరఫున ప్రతినిధులు హాజరయ్యారు.
"మొత్తం 12 డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి సబిత ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. మౌలిక సౌకర్యాలకు తక్షణమే రూ.5.6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా డిమాండ్ల పరిష్కారానికి హామీ లభించింది. రెగ్యులర్ వీసీ నియామకానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటీకి ఛాన్స్‌లర్‌ను నియమిస్తామన్నారు. తమపై నేతలు, అధికారుల నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదు."- విద్యార్థులు
ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలపై విద్యార్థుల వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఎండ, వాన, పగలు, రాత్రీ అనే తేడా లేకుండా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్దే బైఠాయించారు. అధికారులు నచ్చజెప్పినా, మంత్రులు బుజ్జగించినా డిమాండ్లు నెరవేర్చే వరకూ.. పోరుబాట వీడబోమని తేల్చి చెబుతున్నారు. వర్షంలో తడుస్తూనే తమ 12 డిమాండ్లపై... విద్యా శాఖ మంత్రి నుంచి రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఫలితంగా.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. బాసర ట్రిపుల్ఐటీకి సోమవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. విద్యార్థి ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు. అప్పటివరకు వర్షంలోనే దాదాపు 6వేల మంది విద్యార్థులు నిరసన తెలిపారు. చర్చల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రిపుల్ఐటీ వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సమస్యలు విన్న మంత్రి.. వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. 15 రోజుల్లో మరోసారి క్యాంపస్‌ను సందర్శిస్తానని విద్యార్థులకు మంత్రి సబిత హామీ ఇవ్వటంతో... రోడు రోజులుగా నెలకొన్న విద్యార్థుల నిరసనకు ఎట్టకేలకు తెరపడింది.
ఇవీ చూడండి: