కృతిమ మేధతో వ్యక్తులను ప్రశ్నించకుండానే అనారోగ్య సమస్యలను గుర్తించేందుకు వీలుగా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ‘ధార’ పేరుతో హైదరాబాద్‌లోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(పీహెచ్‌ఎఫ్‌ఐ) హై ర్యాపిడ్ ల్యాబ్ రూపొందించింది. ఈ సంస్థకు అమెరికన్ లెప్రసీ మిషన్ సంస్థ సహకారం అందిస్తోంది. తొలుత కుష్ఠు, బోదకాలు బాధితులను గుర్తించేందుకు వీలుగా నిర్మల్ జిల్లాలో ప్రయోగాత్మక ప్రాజెక్టు చేపట్టింది.
నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద, పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ సర్వే నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఏఎన్‌ఎంలకు స్మార్ట్‌ఫోన్లు అందించి.. వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఆయా ఏఎన్‌ఎంలు.. నిర్దేశించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలకు వెళ్లి.. అక్కడి ఇళ్లు, వాతావరణం, తాగునీటి నాణ్యత, వ్యక్తిగత- పరిసరాల పరిశుభ్రత, కుటుంబాల వారీగా వ్యక్తులను స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలను ‘ధార’ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తారు. ఒక్కో కుటుంబంలోని సభ్యుల చిత్రాల ఆధారంగా వారి ఎత్తు, బరువు, ఏమైనా వైకల్యం ఉంటే తెలియడంతో పాటు ఎవరికైనా కుష్ఠు, బోదకాలు లక్షణాలు ఉంటే గుర్తిస్తుంది. అనంతరం బాధితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స ప్రారంభిస్తారు. ఈ విధానం విజయవంతమైతే మిగతా వ్యాధులనూ గుర్తిస్తామని పీహెచ్‌ఎఫ్‌ఐ ప్రిన్సిపాల్ డా.సురేష్‌మునుస్వామి తెలిపారు.
ఇదీ చూడండి: సిరిసిల్ల జిల్లాలో కరోనా కలకలం.. ఒక్కరోజే 104 కేసులు