నిర్మల్ జిల్లాలో 400మంది పోలీసు సిబ్బందితో లాక్‌డౌన్ నిబంధనలు అమలుచేస్తున్నట్లు ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. లాక్‌డౌన్ రెండో రోజు ఉదయం 10 గంటల నుంచి నిర్మల్ పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద సీఐ స్థాయి పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ధ్రువ పత్రాలను పరిశీలిస్తున్నారు.
జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారుఖీ, ఎస్పీ స్వయంగా పట్టణంలో పర్యటించారు. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద సమీక్షించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అవసరమైన చోట్ల బందోబస్తుతో పాటు రోడ్లపైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రణాళిక ప్రకారం బందోబస్తు సిబ్బందిని మూడు షిఫ్టులుగా విభజించి.. విధుల్లో కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. డీఎస్పీలు క్షేత్ర స్థాయిలో ఉండి లాక్‌డౌన్ అమలుకు చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు విధుల నిమిత్తం వెళ్లే ఉద్యోగులు గుర్తింపుకార్డులు చూపిస్తే సరిపోతుందన్నారు.
ఇదీ చూడండి: లాక్‌డౌన్ ఎఫెక్ట్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద రద్దీ