మత్సకారుల సహకార సంఘము తరఫున అన్ని ధ్రువపత్రాలు పొందినా గ్రామంలోని చెరువుల్లో చేపలు పట్టుకోనివ్వడం లేదని నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చించాలకు చెందిన మత్సకారులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం ఇవ్వడంలో కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
గ్రామంలో ఉన్న ఐదు చెరువుల్లో చేపలు పట్టుకుని జీవనం సాగించేందుకు గతంలో పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చిందని... అప్పటి నుంచి ప్రభుత్వం అందిస్తున్న చేప పిల్లలు చెరువుల్లో వేసుకుని వాటిని పట్టి జీవనం సాగిస్తున్నామని మత్సకారులు తెలిపారు. కానీ ఈ మధ్య కాలంలో పంచాయతీకి ఆదాయం రావడం లేదంటూ కొందరు చెరువుల్లో చేపలు పట్టుకోవద్దంటూ తమను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.