Devuni Cheruvu Jatara Narsapur : ఎటు చూసినా దట్టమైన వృక్షాలు... ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం... పక్కనే చెరువు... మధ్యలో కొలువై ఉన్న ఆలయం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా నిర్మల్ జిల్లాలో దేవునిచెరువు ఆలయం విరాజిల్లుతోంది. నర్సాపూర్(జి) మండలానికి సమీపంలోని అడవుల్లో, చుట్టూ చెరువు మధ్యలో గుట్టపై అద్భుత కళాకృతులతో ఉన్న ఆలయాన్ని... దేవుని చెరువుగా పిలుస్తున్నారు. సుమారు 600 ఏళ్ల క్రితం కట్టినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఆలయంలో ఏటా మార్గశిర మాసంలో రెండు రోజులపాటు జాతర నిర్వహిస్తారు. ఈ ఆలయంలో భ్రమరాంభికామల్లికార్జున స్వామి కొలువై ఉన్నాడు.
వైభవంగా దేవుని చెరువు జాతర
ఈ ఆలయాన్ని 1974లో పునరుద్ధరణ చేశారు. అప్పటి నుంచి ఏటా మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం అనగా మొదటి శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పూజిస్తారు. ముందురోజు శనివారం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి కల్యాణం జరిపిస్తారు. గతంలో ఈ కల్యాణ వేడుకలను అర్ధరాత్రి జరిపించేవారు. ఈనెల 26న శనివారం అర్దరాత్రి వైభవంగా జరిగింది. మల్లన్నలుగా పేరొందిన ఒగ్గు కళాకారులు... స్వామి చరిత్రను వర్ణిస్తారు.
"దేవుని చెరువుగా పేరొందిన శ్రీ భ్రమరాంభికామల్లికార్జున స్వామి ఆలయం రాతితో దాదాపు 600 ఏళ్ల క్రితం నుంచే నిర్మించి ఉంది. మల్లన్నలుగా చెప్పుకునే ఒగ్గు కథ చెప్పేవారు స్వామి చరిత్రను వర్ణిస్తారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఏటా మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం మొదటి శుద్ధషష్ఠిని ఈ సుబ్రహ్మణ్యషష్ఠిగా జరుపుకుంటాం. అప్పుడే కొత్తగా వచ్చిన ధాన్యంతో స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ దేవుని చెరువు జాతరకు నిర్మల్ చుట్టూ పక్కల వారే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు."
-నరహరి, దేవుని చెరువు ఆలయ పూజారి
వనభోజనాలు ఇక్కడ స్పెషల్
కొత్త ధాన్యంతో పాయసం చేసి స్వామికి నివేదిస్తారు. అలాగే ఒగ్గు కథ చెప్పేటువంటి మల్లికార్జున స్వామి భక్తులైన ఆ మల్లన్నలకు ప్రసాదం నివేదన చేసి తర్వాత భక్తులు స్వీకరిస్తారు. ఈ సుబ్రమణ్య షష్ఠిని "సట్టి పండుగ" పేరుతో జరుపుతారు. చుట్టూపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. వారంతా వనభోజనాల పేరిట... ముందుగా పాయసం చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. తర్వాత అక్కడే వంటలు చేసుకొని ఆరగిస్తారు.
'ఈ ఆలయానికి చాలా విశేషం ఉంది. మాజీ సర్పంచ్ జీవీ నర్సారెడ్డి, గ్రామస్థుల సహకారంతో 1974లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అప్పట్లో ఈ గుడిని శ్రీ శ్రీ జగద్గురు శంకచార్యులు ప్రారంభించారు. మా తాతల కాలంలో ఈ గుడి రాతిరాళ్లతో ఉండేది. ఏ మొక్కు మొక్కినా తీరుస్తాడనే నమ్మకం మా తాతల కాలం నుంచే ఉంది.'
-ఎ.రామయ్య , జడ్పిటీసీ నర్సాపూర్ (జీ)
అద్భుత దృశ్యాలు
కొన్ని పురాతన శిల్పాలు సైతం అక్కడ ఉన్నాయి. ఆలయం చుట్టూ చెరువు ఉంది. ఆ చెరువు నుంచి దిగువకు జాలువారే జలదృశ్యాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. వర్షాకాలంలో ఆ దృశ్యాలు మరింత మనోహరంగా ఉంటాయి.
'నాకు చిన్నప్పటి నుంచి ఈ గుడితో అనుబంధం ఉంది. ఇది చాలా మహిమ గల దేవాలయం. దీనిని దేవుని చెరువుగా పిలుస్తాం. ఇంతకుముందు చాలా దట్టమైన అరణ్యం ఉండి రహదారి కూడా లేకపోయేది. 1974-75 కాలంలో గ్రామస్థులందరు కలిసి చందాలు వేసుకొని ఈ ఆలయాన్ని పునరుద్ధరించుకున్నారు. రోడ్లు వేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. అనుకున్న కోరికలు తీరుతాయి.'
-భక్తుడు, నర్సాపూర్ జీ గ్రామస్థుడు
ఇదీ చదవండి: Yadadri reconstruction works: శరవేగంగా క్షేత్రాభివృద్ధి పనులు.. తుది దశకు హరిహరుల ఆలయాలు