9 Medical Colleges Inauguration in Telangana : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు వర్చువల్ పద్ధతిలో... కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుముంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతుల్ని సీఎం ప్రారంభిస్తారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
9 Medical Colleges Opening in Telangana : పేద విద్యార్థులకు వైద్యవిద్య మారుమూల ప్రాంతాలకు అత్యున్నత వైద్య సేవలు చేరువ చేయడం లక్ష్యంగా జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల అనే కలను.. తమ ప్రభుత్వం సాకారం చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ... డాక్టర్లను తయారు చేయడంలోనూ అగ్రస్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఏడాదికి పది వేల మంది వైద్యులను.. దేశానికి అందించేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండున్నర లక్షల ర్యాంకు వచ్చినా, ఓసీ విద్యార్థులకైతే లక్షన్నర ర్యాంకు వచ్చినా.. ఎంబీబీఎస్ సీటు లభించేలా మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురావడం చరిత్ర.. హరీశ్‌రావు అభివర్ణించారు.
Nirmal Medical College : మరోవైపు నిర్మల్ జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభం కావడంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్ష్యం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో సంబురాలు జరుపుతున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. బాణా సంచా కాలుస్తూ ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని వివరించారు.
"మెడికల్ కాలేజీ వల్ల తెలంగాణకు ఒక కళ వచ్చింది. ఒకప్పుడు మెడికల్ కాలేజీ ఎక్కడో ఉంది అని మాట్లాడుకునేవాళ్లం. ఉత్తర తెలంగాణలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి అంటే అందరు వరంగల్ అని చెప్పేవారు ఇప్పుడు నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది." - ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి
కొత్త జిల్లా ఏర్పడటమే అదృష్టంగా భావిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ జిల్లాకు వైద్య కళాశాల ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కళాశాలలో తొలి ఏడాదికి గాను 100 సీట్లను మంజూరు చేశారని.. ఇందులో అఖిల భారత (ఆల్ ఇండియా) కోటాలో 15 సీట్లు, రాష్ట్రస్థాయి కోటాలో 85 చొప్పున సీట్లను కేటాయించారని తెలిపారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం వల్ల పేద, మధ్య తరగతి వారికి కూడా ఈ విద్య అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. డాక్టర్ విద్య చదువుకోవాలని అనుకుంటున్న ప్రతి విద్యార్థి ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని యువతకు సూచించారు.
9 Medical Colleges opening Telangana 2023 : ఒకేరోజు.. 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం