నీ బిడ్డలను గుర్తు పట్టగలవా? నీ ఊరు పేరు గుర్తుందా? నేనెవరినో చెప్పగలవా?... ఇవన్నీ తప్పిపోయిన చిన్నారిని అడుగుతున్న ప్రశ్నలుకావు. 13 ఏళ్ల కిందట ఇంటికి దూరమైన... ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి 13ఏళ్ల కిందట రాత్లవత్ చత్రు వచ్చాడు. ఎలా వచ్చాడో.. తన వాళ్లు ఎవ్వరో తెలియదు.. గ్రామస్థులందరికీ తల్లో నాలుకలా కలిసిపోయాడు. ఎవ్వరేపని చెప్పినా చేస్తూ పెట్టింది తినేవాడు. ఎవరో తెలియని చత్రు ఆ ఊరోళ్లతో కలిసిపోయాడు. ఈ క్రమంలో సరదాగా చెప్పుకున్న కబుర్లతో అతడు తన ఇంటికి చేరుకోకలిగాడు. అదెలా అంటారా...
గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చత్రుతో సరదాగా మాట్లాడుతూ టిక్‌టాక్ వీడియో తీసి అప్లోడ్ చేశాడు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో ఉంటున్న చత్రు కుటుంబ సభ్యులు.. తమ తండ్రిని గుర్తించి... అతడున్న చోటుకొచ్చారు. 13 ఏళ్ల తర్వాత తండ్రిని చూసిన బిడ్డలు... పిల్లలను చూసుకున్న తండ్రి సంతోషంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా మమకారపు అనుభూతికి లోనయ్యారు.
ఇన్నాళ్లు తమతో కలిసిపోయిన చత్రు తన వాళ్లను చేరుకున్నాడన్న సంతోషం ఒకవైపు ఉన్నా... అలవాటైపోయిన వ్యక్తి దూరమైపుతున్నడని గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు. అందరికీ అనుకోని బంధువైన చత్రుకి నూతన వస్త్రాలు పెట్టి సాగనంపారు గుడిగండ్ల గ్రామస్థులు. 13 ఏళ్ల తర్వాత టిక్‌టాక్ ద్వారా ఇంటికి చేరుకున్న చత్రు ఇకపై సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.
ఇవీ చూడండి: తడిసిన నయనం.. ఆగని పయనం