నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న నిరాహారదీక్షలో భాగంగా వైఎస్ షర్మిల (YS Sharmila)... నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఇందుకోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.
ఉదయం ఏడున్నరకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఆమె... చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మీదుగా వేదిక వద్దకు చేరుకుంటారు. తొమ్మిదిన్నర గంటలకు కార్యక్రమం మొదలవుతుందని వైఎస్ఆర్టీపీ నాయకులు చెబుతున్నారు.
ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా, నిరాహార దీక్ష వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా ప్రకటిస్తున్నట్లు వైఎస్ షర్మిల గతంలో చెప్పారు. నిరుద్యోగులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
50 వేల ఉద్యోగాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు. నిరుద్యోగులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గత వారం వనపర్తి జిల్లాలోని తాడిపర్తిలో రోజంతా నిరాహార దీక్ష చేశారు.
ఇదీ చూడండి: YS SHARMILA: ప్రతి మంగళవారం.. నిరుద్యోగ వారం: వైఎస్ షర్మిల