యురేనియం తవ్వకాల అంశం నల్లమల ప్రాంత వాసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. నల్గొండ జిల్లా పెద్ద ఆడిషర్లపల్లి మండలం పెద్దగట్టు ప్రాంత భూగర్భంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. వాటిని వెలికితీసేందుకు పరీక్షలు నిర్వహించిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్... 1300 పైచిలుకు ఎకరాల లీజు కావాలని 2002లోనే నాటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. కానీ ఈ ప్రాంతంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో సర్కారు వెనకడుగేసింది. కేవలం పెద్దగట్టు తండా మాత్రమే కాకుండా బూడిదగుట్ట తండా, నంబాపురం, ఎల్లాపురం, పులిచర్ల తదితర గ్రామాలు సైతం ప్రభావిత గ్రామాల జాబితాలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పరీక్షల కోసం వేసిన బోర్లు ఇప్పటికీ రైతుల పొల్లాలో దర్శనమిస్తున్నాయి.
ఎక్కడికి పోయి బతకాలి...?
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాల్లో నందికొండ ఒకటి. అక్కడి నుంచి కుటుంబాలు చెట్టుకొకటి పుట్టకొకటిగా చెల్లాచెదురయ్యాయి. ఆ ప్రాంతంతో బంధాన్ని తెంచుకోలేని కొన్ని కుటుంబాలు నందికొండ నుంచి పెద్దగట్టుకు చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నాయి. ఇప్పుడా గ్రామంలో కనీసం 650 కుటుంబాలున్నాయి. 4 వేల ఎకరాల సాగు భూమి ఉంది. పెద్దగట్టు చుట్టూ కనుచూపు మేరలో పచ్చగా పరుచుకున్న పంటలు కనిపిస్తాయి. ఇలాంటి గ్రామంలో యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడం వల్ల మరోమారు అలజడి ఏర్పడింది. పదుల ఎకరాలను నందికొండ ముంపులో పోగొట్టుకున్నా... కుటుంబానికి 5 ఎకరాలే ఇచ్చారని... మళ్లీ ఇక్కడి నుంచి తరిమితే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
80 నుంచి 100 కిలోమీటర్లకు ప్రభావం...
నంబాపురం, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో ఒక ఓపెన్ కాస్ట్, 3 భూగర్భ గనులు తవ్వాలన్న నివేదికలు యుసీఐఎల్ వద్ద సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఒక్కసారి తవ్వకాలు మొదలైతే 20 ఏళ్ల పాటు కొనసాగనున్నాయి. యురేనియం తవ్వకాలు జరిపితే దాని ప్రభావం చుట్టూ దాదాపు 80నుంచి100 కిలోమీటర్ల మేర ఉంటుంది. పంటలు, నీరు కలుషితం అవుతాయని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
నర్సింహ, నంబాపురం గ్రామాలను విడిచివెళ్లే ప్రసక్తే లేదని, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాడుతామని ఆ ప్రాంత ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చూడండి: గజ్వేల్ హోటల్లో కే'టీ'ఆర్ బ్రేక్