Tension in Munugode: నల్గొండ జిల్లా మునుగోడు చౌరస్తాలో భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉప ఎన్నిక సమయంలో గొల్ల, కురుమల ఖాతాల్లో డబ్బులు జమచేసి.. ఎన్నికలు అయిపోగానే ఆ డబ్బులను వెనక్కి తీసుకున్నారని ఆరోపిస్తూ తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయోత్సవ ర్యాలీగా అటువైపు రావడంతో ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే జెండాలతో ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి కూసుకుంట్ల పూలమాల వేసి అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఎన్నికల సమయంలో డబ్బులు ఇచ్చి.. ఇప్పుడు తీసుకోవడం ప్రజలను మోసం చేయడమే అంటూ రాజగోపాల్‌రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి.. కాసేపు నిరసన తెలిపారు.
ఇవీ చూడండి:
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబీకులకు చెందిన సుశీ ఇన్‌ఫ్రాలో తనిఖీలు
ఉగ్రవాదుల నుంచి ముప్పు అంటే.. ఇలాంటి వాహనం ఇస్తారా..? : రాజాసింగ్