Students Protest not to Transfer Teachers: సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తుంటారు. కానీ కొందరు టీచర్లు మాత్రమే మంచి పేరు సంపాదించుకుంటారు. వారిపై ఎనలేని ప్రేమ, అభిమానాన్ని కురిపిస్తుంటారు విద్యార్థులు. అదే కోవకు చెందిన వారు నల్గొండ జిల్లా శిల్గాపూర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు. తాజాగా ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయ బదిలీలలో వారికి ట్రాన్స్ఫర్ తప్పనిసరి అయింది. దాంతో ఆ పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులు అది తట్టుకోలేకపోతున్నారు. 'మా ఊరి బడికి జీవం పోసిన మా సార్లను బదిలీ చేయవద్దు' అంటూ విద్యార్థులతో కలిసి గ్రామస్థులు నిరసనకు దిగారు. ట్రాక్టర్లు, బైక్‌లపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.
మా సార్లను బదిలీ చేయవద్దు: నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని శిల్గాపూర్ ప్రాథమిక పాఠశాలలో కట్టెబోయిన సైదులు, ఆకువరపు శివప్రసాద్, ఎర నాగుల సైదులు అనే ముగ్గురు ఉపాధ్యాయులు 8 ఏళ్ల క్రితం విధుల్లో చేరారు. అప్పటి నుంచి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను చక్కగా బోధిస్తున్నారు. విద్యార్థులు కూడా వారు చెప్పినట్లు చదువుకుంటూ పలు ప్రభుత్వ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించారు. వారి వద్ద విద్యనభ్యసించిన పలువురు గురుకుల సీట్లు సాధించారు. తాజాగా ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టింది దాంతో వారు వేరే ఊరు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే తమకు ఇష్టమైన టీచర్.. వేరే గ్రామానికి వెళ్లిపోతున్నారన్న విషయం తెలియగానే విద్యార్థులు తట్టుకోలేకపోయారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు కూడా చాలా బాధపడ్డారు. దీంతో విద్యార్థులు, గ్రామస్థులంతా కలిసి బదిలీ రద్దు చేయాలని ఆందోళనకు దిగారు.
ఆ ఊర్లో ఒక్కరూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లరు : ఆ ఉపాధ్యాయులు విధుల్లో చేరినప్పుడు ఉన్న పరిస్థితులు తలుచుకుంటే నేడు ఉన్న పాఠశాల అదేనా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఆ ఉపాధ్యాయులు అంతటి మార్పు తీసుకువచ్చారు. ఆ గ్రామంలో ఒక్కరూ కూడా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లరంటే అర్థం చేసుకోండి. ఆ ఊరికి ప్రైవేటు పాఠశాల బస్సులు రావు. ప్రభుత్వ పాఠశాలపై అంత మక్కువ అక్కడి పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఆ గ్రామ పాఠశాలను అభివృద్ధి చేస్తూ, అంకితభావంతో పనిచేస్తూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందిస్తున్న ఉపాధ్యాయులను బదిలీ చేయవద్దని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఆ ఉపాధ్యాయులు పాఠశాల సమయం కంటే అధిక సమయం కేటాయిస్తూ, సెలవు దినాలలోనూ విద్యార్థులకు విద్యనందించారని గ్రామస్థులు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామ విద్యార్థులకు చక్కని భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఆ ఉపాధ్యాయులను బదిలీ చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కలెక్టర్ గారిని కోరారు.
ఉన్నతాధికారులు స్పందించాలి : గత 2 ఏళ్ల కిందట కరోనా మహమ్మారి వల్ల తమ విద్యార్థుల చదువులు పాడవకుండా వీధుల్లో వర్ణమాల, అక్షర మాల, గుణింతాలు, ఎక్కాలు, తదితర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విద్యా బోధన చేపట్టారు ఆ ఉపాధ్యాయులు. ఈ పాఠశాలలో పని చేస్తున్న సైదులు అనే ఉపాధ్యాయునికి గత సంవత్సరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నారు. 8 ఏళ్లుగా పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిన తమ గ్రామ ఉపాధ్యాయులు బదిలీల వల్ల తమకు ఎక్కడ దూరం అవుతారో అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని గ్రామస్థులు, విద్యార్థులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: