నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అవంతిపురం వ్యవసాయ మార్కెట్లో మహిళా సంఘాలకు, గొర్రెల పెంపకం సంఘ సభ్యులకు అద్దె పనిముట్లను ఎమ్మెల్యే భాస్కరరావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పంపిణీ చేశారు. ఓ ట్రాక్టర్, వరి నాటు మిషన్, గడ్డి చుట్టే రోలర్ తదితర పరికరాలను సంఘ సభ్యులకు అందజేశారు. ఐకేపీ కేంద్రాల్లో రైతు సమాఖ్యకు టార్పాలిన్లు పంపిణీ చేశామని.. రైతులకు రసాయనాలు పిచికారి చేసే పంపులను, చిన్న జీవాల పెంపకం దారులకు ఆరు లక్షలతో వేయింగ్ మిషన్ వ్యాక్సిన్ బాక్సులను వారికి పంపిణీచేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మిర్యాలగూడ మహిళా సమైక్యకు సబ్సిడీపై పరికరాలను అందజేసినట్లు ఎమ్మెల్యే భాస్కరరావు తెలిపారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మిర్యాలగూడ మహిళా సమైక్యకు అద్దె వ్యవసాయ పనిముట్లను అందించారని, సంఘ సభ్యులు పట్టుదలతో పనిచేస్తూ లబ్ధి పొందాలని సూచించారు. తద్వారా సంఘ సభ్యులు ఆర్థికంగా పురోగతి చెందాలని కోరుకున్నారు. అద్దె పనిముట్లను సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలని కలెక్టర్ కోరారు. భవిష్యత్తులో మరిన్ని మహిళా సంఘాలకు చేయూత నివ్వడానికి మిర్యాలగూడ మహిళా సంఘం ఆదర్శంగా ఉండాలన్నారు.