హుజూరాబాద్ నియోజకవర్గానికి దళిత బంధుతోపాటు అభివృద్ధి పనులకు రూ.3వేల కోట్లు ప్రకటించిన మాదిరిగానే.. తన నియోజకవర్గానికీ రూ.1,500 కోట్లు కేటాయిస్తే తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని.. తిరిగి పోటీ కూడా చేయనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఆయన శిర్థేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. నిధులిస్తానంటే తెరాసలో చేరడానికీ సిద్ధమని ఈ సందర్భంగా ఓ కార్యకర్త చేసిన వ్యాఖ్యపై స్పందించారు.
ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలను కొన్నారని, తన ఎమ్మెల్యే పదవినీ తీసుకొంటే 13 అవుతాయని తెరాసను ఉద్దేశించి రాజగోపాల్ అన్నారు. ప్రజల కోసం వెళ్తానని, తనకు పదవి ముఖ్యం కాదని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలపై వివక్ష కొనసాగుతోందని రాజగోపాల్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడన్న కారణంతో ప్రభుత్వం నిధులివ్వడం లేదని వ్యాఖ్యానించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నిధులు తెస్తే అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు. శంకుస్థాపనలు, ఫ్లెక్సీలపై తమ పేర్లు ముఖ్యం కాదని, అయితే ప్రొటోకాల్ పాటించాల్సిందేనని వెల్లడించారు. తన నియోజకవర్గంలో మంత్రి రేషన్ కార్డులను ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: డీపీఆర్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ పని: కృష్ణా బోర్డు