ఒకవైపు వృద్ధ తల్లిదండ్రులు... మరోవైపు భర్త కాలం చేయగా.. ఇద్దరు పిల్లలతో తల్లి వద్దే ఉంటున్న చెల్లెలు. మూత్రపిండాలు చెడిపోయిన తండ్రి.. నాలుగు రోజులకోసారి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి.. అటు చెల్లెను, ఆమె పిల్లలను, తల్లిదండ్రుల బాగోగులను చూసుకుందామనుకున్న అతనికి తీరని కష్టం వచ్చింది. కండరాల వ్యాధి.. మంచంలోంచి కదలనీయకుండా చేసింది. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న కుటుంబంలో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కన్నీరు పెట్టుకోవడం.. సాయం కోసం ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి వారిది. మానవతా హృదయంతో దాతలు స్పందిస్తేనే... ఆ కుటుంబానికి ఆసరా.
ఆశలు ఆవిరి..
నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన జంపాల హన్మంతు, అంజమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు సంతానం. హన్మంతు తన కుల వృత్తి అయిన క్షవరాలు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అలాంటి పేదరికంలోనూ ఒక్కగానొక్క కొడుకు గోపాల్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కన్నవాళ్ల రుణం తీర్చుకోవాలని, పెద్దయ్యాక వారిని బాగా చూసుకోవాలని చిన్నప్పటి నుంచే ఆలోచించేవాడు గోపాల్. 20 ఏళ్ల వయసు వచ్చే వరకు బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాతే ఆయనపై అనుకోని వ్యాధి దాడి చేసింది. కదలలేని స్థితికి చేరిపోయాడు. చేతులు కాళ్లలో చలనం లేదు. వైద్య పరీక్షలు చేయిస్తే.. తెలిసింది. వైద్యమే లేని వ్యాధి సోకిందని. బతికినన్ని రోజులు కాపాడుకుందామని ఆ తల్లిదండ్రులు శక్తికి మించి ప్రయత్నం చేశారు. కొడుకు కోసం ఇప్పటిదాకా రూ.8 లక్షలు వెచ్చించారు.
మందు లేని రోగం..
జంపాల గోపాల్ ఐదో తరగతి వరకు నేరడ పాఠశాలలో... ఆరు నుంచి పదో తరగతి వరకు నాగార్జునసాగర్ గురుకులంలో చదివాడు. అనంతరం మండల కేంద్రమైన చిట్యాలలో ఇంటర్ పూర్తి చేశాడు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబానికి ఆదరువుగా ఉండాలని భువనగిరి ఐటీఐ కళాశాలలో వెల్డింగ్ విభాగంలో కోర్సు పూర్తి చేశాడు. కోర్సు పూర్తయిన ఏడాదే హకీంపేట బస్ డిపోలో ఉద్యోగావకాశం వచ్చింది. విధుల్లో చేరుదామనుకునే సమయానికి అంతుచిక్కని వ్యాధి బయటపడింది. ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటే... అది కండర క్షీణతగా వైద్యులు నిర్ధారించారు. ఆయుర్వేదం, హోమియోపతి, నాటు వైద్యం... ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. చికిత్స కోసం ఎన్నో దవాఖానాలు తిరిగారు. కానీ ఆ వ్యాధికి మందే లేదని వైద్యులు చెప్పారు.
ఫించన్ ఆసరాగా నిలిచింది..
కండర క్షీణత వ్యాధి సోకిన వారు... అది బయటపడిన 22 ఏళ్లకు ప్రాణాలు కోల్పోయే దశకు చేరుకుంటారు. ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడి గోపాల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి. పూర్తిగా మంచానికే పరిమితమై 11 ఏళ్లవుతోంది. ఎప్పుడు ఏమవుతుందోనన్న బెంగతో... అనుక్షణం ఆందోళనతో కాలం గడుపుతున్నాడు. కొన్నేళ్ల క్రితం వరకు గోపాల్ తల్లిదండ్రులు ఏదో కూలి పని చేసి... కొడుకును చూసుకునేవారు. ఇప్పుడు వారిద్దరికీ వయసు మీద పడింది. కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీనికితోడు గోపాల్ తండ్రికి రెండు మూత్రపిండాలు చెడిపోయాయి. చిన్న చెల్లెలు భర్త చనిపోగా.. ఇద్దరు పిల్లలతో వచ్చి తల్లిగారింటి వద్దే ఉంటోంది. రేషన్ బియ్యంతోపాటు ఆసరా పింఛనే ఇప్పుడు ఆ కుటుంబానికి ఆధారంగా మారింది.
దయచేసి ఆదుకోండి..
కండర క్షీణత వ్యాధి అయిన మస్కులర్ డిస్ట్రోఫీ ఏడు రకాలు. అందులో ఉప విభాగాలుగా లెక్కిస్తే 110 రకాలు. అలాంటి అరుదైన వ్యాధికి గురైన గోపాల్‌కు... అన్నం తినిపించడం దగ్గర్నుంచీ అన్ని పనులూ కన్నతల్లే చేసి పెడుతోంది. మంచంపై నుంచి కదలలేని కొడుకును లేపి నిలబెట్టాలని.. నడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ.. ఫలితం ఆమెను వెక్కిరించింది. ఇలాంటి కేసులు రాష్ట్రంలో నాలుగు వేల వరకు ఉండొచ్చని తెలంగాణ మస్కులర్ డిస్ట్రొఫీ అసోసియేషన్ అంచనా. మేనరికం వల్ల జన్యుసంబంధ వ్యాధిగా కండర క్షీణత వస్తుందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, సోదరి వైద్య ఖర్చులే నెలకు 7 వేల వరకు అవుతున్నాయని, వారి వైద్య ఖర్చులు, కుటుంబ భారంగా మారిందని గోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు మానవతా హృదయంతో స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. వైద్యం లేని వ్యాధికి ప్రయోగాలు చేయదలచుకుంటే... తన శరీరాన్ని అప్పగిస్తానంటున్నాడు. గోపాల్‌కు సహాయం చేయాలనుకున్న వారు.. మానవత్వంతో తోచినంత ఆర్థిక సహాయం చేయవచ్చు.
ఇదీ చూడండి : పిడుగు పడి వ్యక్తి మృతి..స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు