ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ గ్రామీణం, కనగల్, తిప్పర్తి, బొమ్మలరామారం, చౌటుప్పల్, బీబీనగర్, చివ్వెంల తదితర మండలాల్లోని ఎక్కువగా గిరిజన తండాల్లో కూరగాయలను పండిస్తున్నారు. వీటిని సమీప పట్టణాల్లోకి తీసుకెళ్లి అమ్మడం, ఇతర ప్రాంతాలకు రవాణా చేసేవారు. లాక్‌డౌన్ వల్ల రాకపోకలు స్తంభించి, ప్రభుత్వం నిత్యావసరాలను ఎక్కువ ధరలకు అమ్మకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడం వల్ల... గతంతో పోలిస్తే కూరగాయల ధరలు తక్కువగానే ఉన్నాయి. మరోవైపు రవాణా నిలిచిపోయి వాటిని కొనేవారు లేరు. రైతు వద్ద టమాటాలను 2 రూపాయలకు సైతం వ్యాపారులు కొనడం లేదు. బహిరంగ మార్కెట్లో వీటి ధర రూ.8 నుంచి రూ.10 పలుకుతోంది. కొందరు రైతులు చేసేదేమీ లేక చిల్లరగా అమ్ముకుంటున్నారు. పెద్ద రైతులు వాటిని తోటల్లోనే వదిలేస్తున్నారు.
ఇతర కూరగాయలు సైతం
ఇతర కూరగాయలు పండిస్తున్న అన్నదాతలదీ అదే పరిస్థితి. వేసవిలో దిగుబడులు తగ్గి, డిమాండ్ పెరగడం వల్ల సహజంగా లాభాలు వస్తాయనుకునే రైతులకు... ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఇటీవల లాక్‌డౌన్ పరిస్థితుల్లో సంచార నిత్యావసరాలు, కూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో ఏ కూరగాయలు ఎంత ధరకు అమ్మాలో ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉండగా... తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు. సంచార రైతు బజార్లను నిర్వహించే వారికి నష్టాలు రానివ్వమని.. ఆ పరిస్థితి వస్తే తామే ధరలను సవరిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.
ఈ రైతు పేరు జినుకుల వెంకటయ్య, గుర్రంపోడు మండలం పల్లిపహాడ్. ఆయనకున్న రెండెకరాల్లో టమాటా సాగుచేశారు. గతంలో ఇక్కడి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు రవాణా అయ్యేవని, ప్రస్తుతం ఆ సౌకర్యం లేక... కొనేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తెంపి అమ్మితే కూలీ సైతం రాకపోవడం వల్ల వాటిని చెట్లపైనే వదిలేస్తున్నామన్నారు. నల్గొండ గ్రామీణ మండలం రసూల్‌పురాకు చెందిన సైదిరెడ్డి, సైదులు రైతుల పరిస్థితీ ఇలాంటిదే.
కట్టా ముత్తారెడ్డి రైతుది మాడ్గులపల్లి. ఈయనకున్న రెండెకరాల్లో బెండ, సొర, దోస కాయలను సాగు చేశారు. వీటికి వేసవిలో డిమాండ్ ఉంటుంది. గతంలో ఈయన వద్దకు వచ్చే వ్యాపారులు టోకుగా కొనుక్కొనేవారు. ప్రస్తుతం ఎవరూ రావడం లేదని, నష్టాలొస్తాయని తానే చిల్లరగా అమ్మడం లేదా తక్కువ ధరకు అమ్ముతున్నానని చెప్పారు. మిర్యాలగూడ, నల్గొండలకు తరలిస్తే కిరాయి సైతం వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక