Jagadish Reddy Comments ON BJP: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ, మునుగోడు అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఇస్తే ఉప ఎన్నిక బరి నుంచి వైదొలుగుతామని భాజపా అధిష్ఠానానికి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా కాంట్రాక్టుల రూపంలో ఇచ్చిన సొమ్ము మునుగోడు అభివృద్ధికి ఇవ్వాలని ఆయన కోరారు.
ఒక వ్యక్తి కోసం రూ.18 వేల కోట్లు ఇవ్వడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి.. అలా చేస్తే ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటామని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు సోదరుల సాక్ష్యంగా చెబుతున్నా.. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాధేయపడైనా సరే ఒప్పిస్తానని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సొంత ఆలోచనలతోనే తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి పథాన నిలుపుతున్నారని వివరించారు.
అధికారంలో ఉన్న భాజపా మాత్రం ఒక్క పైసా ఇవ్వలేదు.. దేశంలో ముందెన్నడూ లేని విధంగా నల్గొండ జిల్లా అభివృద్ధి అయిందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. దామరచర్ల వద్ద రూ.30 వేల కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మాత్రం ఒక్క పైసా ఇవ్వలేదని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
వడ్డీకి అప్పులు తెచ్చి భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఉండొద్దనే సంకల్పంతోనే దీన్ని నిర్మిస్తున్నామని జగదీశ్ రెడ్డి చెప్పారు. కాకతీయుల కాలం నాటి చెరువుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టారని వెల్లడించారు. ఇందులోనూ కేంద్ర సాయం సున్నా అని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
"ఒక వ్యక్తి కోసం రూ.18 వేల కోట్లు ఇచ్చారు. రూ.18 వేల కోట్లు మా మునుగోడు, మా నల్గొండ జిల్లాకు ఇవ్వండి. అలా చేస్తే ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటాం .ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాధేయపడైనా సరే ఒప్పిస్తాం. అమిత్ షా, కేంద్రమంత్రులు వచ్చారు. కానీ తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదు. కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కేసీఆర్ రూ.90 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ కేంద్రం రూ.9 కూడా ఇవ్వలేదు." -జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: ఆ ప్రచారంతోనే ప్రజల్లోకి వెళ్లాలి: పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
సుప్రీంలో సంచలనం.. కొలీజియంలో తొలిసారి అలా.. కొత్త సీజేఐ వచ్చాకే ఏదైనా..