హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election 2021)లో భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) ఆరోపించారు. భాజపా తీరు నియోజకవర్గంలో ఘర్షణలకు దారితీస్తోందని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని కమలం పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. పశ్చిమబంగలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మమతా బెనర్జీ గెలుపును ఆపలేకపోయారని పేర్కొన్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధర పెరగని రోజులేదన్న గుత్తా(Gutta Sukhender Reddy).. నిత్యావసర వస్తువుల ధర అమాంతం ఆకాశాన్నంటుతోందని చెప్పారు. అయినా కేంద్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తూ సామాన్యుడి నడ్డివిరుస్తోందని ఆక్షేపించారు. ప్రజాసంక్షేమాన్ని మోదీ సర్కార్ గాలికి వదిలేసిందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అగ్రగామిగా నిలవడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు కుట్రలు, కుతంత్రాలు, పాదయాత్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్లే.. ఇప్పుడు పేరు మార్చుకుని వచ్చి మళ్లీ తెలంగాణపై విరుచుకు పడుతున్నారని దుయ్యబట్టారు.
"తెలంగాణ ఆడబిడ్డను అని చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. మరి వాళ్ల రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? ఏపీలో వైఎస్ కుటుంబ పాలన నడవడం లేదా? అడ్రస్ లేని బండి సంజయ్.. తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డిలు పాదయాత్రల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణ వనరుల దోపిడీకి మరో మారు కుట్ర చేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఎన్ని కుట్రలు పన్నినా.. తెరాస గెలుపు ఖాయం."
గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్