Gutha Sukender Reddy allegations on BJP : భాజపా నాయకులు రాజ్యాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఈ నెల 7న నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్కు ఆహ్వానం లేదని భాజపా వాళ్లు చేస్తున్న వాదనలో పసలేదన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు రాజ్యాంగం పట్ల అవగాహన లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కాకపోతే... ఎన్నిసార్లైనా సమావేశాలు జరుపుకునే సదుపాయాన్ని రాజ్యాంగం కల్పించిందన్నారు. వాయిదా పడిన గత సమావేశాలు యధావిధిగా జరుగుతాయన్నారు. దీనిపై అవగాహన లేకుండా భాజపా వాళ్లు రాజకీయంగా విమర్శిస్తున్నారని నల్గొండ జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కేంద్రం నిర్లక్ష్యం'
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే... అక్కడ ఉన్న భారతీయులకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. వారిని కాపాడకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. యూపీలో గెలవాలనే ఉద్దేశమే తప్పా... భాజపా ప్రభుత్వానికి ప్రజలపై ప్రేమ లేదన్నారు. ప్రశాంత్ కిషోర్(పీకే) పైన భాజపా, కాంగ్రెస్ వాళ్లు అవాకులు, చవాకులు పేలుతున్నారని.. ఇది మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కేసీఆర్ వ్యూహం ఫలిస్తుంది'
గతంలో ఆ పార్టీలు.. పీకే నాయకత్వంలో రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారని గుర్తు చేశారు. రాజకీయ ఎదుగుదలలో ఇవన్నీ మామూలేనని అన్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే నాయకుడు లేని నావలాంటిదని ఎద్దేవా చేశారు. వాళ్లలో వాళ్లే... కొట్టుకుంటారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్యూహం వంద శాతం ఫలిస్తుందని.. రాష్ట్రంలో కేసీఆర్ను ఢీకొట్టే నాయకుడేలేరని ధీమా వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ విశ్వనగరం కావాలనే కేసీఆర్ ఆకాంక్ష మేరకు పనులు: కేటీఆర్