ఈ నెల 8న మునుగోడు మండలం కొరిటికల్‌కు చెందిన కూర్పాటి అనిల్ (32)ను కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించగా ఈ ఘటన ఆలస్యంగా ఈ నెల 25న వెలుగులోకి వచ్చింది... తాజాగా మంగళవారం నాంపల్లి మండలం దేవత్‌పల్లిలో వివాహేతర సంబంధం వద్దన్నందుకు సొంత భర్తే భార్యను కత్తితో పొడిచి హత్యచేశారు.
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్‌లో ఈ నెల 24న రాత్రి జరిగిన ఘటనలో తూటి రాంచంద్రయ్య అనే రైతు హత్యకు గురయ్యారు. పక్క పొలం రైతుకు, హతుడికి మధ్య ఉన్న భూ తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత కాలం పాటు స్తబ్దుగా ఉన్న హత్యల సంస్కృతి మళ్లీ జడలు విప్పుతోంది. పోలీసులకు సవాలు విసురుతూ రెండు రోజుల్లోనే ఆరు హత్యలు జరిగాయి. గడిచిన పది రోజుల్లో ఉమ్మడి నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో ఎనిమిది హత్యలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో నలుగురు నల్గొండ జిల్లా కేంద్రం, సమీపంలోనే హత్యకు గురయ్యారు. ఇవన్నీ బండరాయితో కొట్టి చంపినవే కావడం గమనార్హం. గతంలో హత్యలు చేయడానికి నేరస్తులు వివిధ ఆయుధాలు వాడగా... ఇప్పుడు బండరాళ్లను తలపై కొట్టి క్షణికావేశంలో చంపుతున్నారు. నాంపల్లి మండలం పాటిమీదిగూడెంలో మంగళవారం పట్టపగలే అందరూ చూస్తుండగా జరిగిన బోదాసు వెంకటయ్య హత్య సంచలనం సృష్టించింది. గడిచిన పది రోజుల్లో జరిగిన అన్ని ఘటనల్లోనూ హతులు, హంతకులందరూ 40 ఏళ్లలోపు కావడం గమనార్హం.
భూ వివాదాలు.. అక్రమ సంబంధాలు
ఇటీవల జరిగిన అన్ని ఘటనల్లోనూ ప్రధానంగా భూ వివాదాలు.. అక్రమ సంబంధాలే కారణమవుతున్నాయి. కట్టుకున్న వాడు మోసం చేసి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అక్కసుతో గత నెల 10న నల్గొండ కలెక్టరేట్ సమీపంలోని జూబ్లిహిల్స్ కాలనీలో సవతి తల్లి ఇద్దరు పిల్లలను హత్య చేయడంతో పాటూ తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో అణ్యంపుణ్యం ఎరుగని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పలు ఘటనల్లో పోలీసుల వద్దకు వచ్చే వారికి సఖీ కేంద్రం, మహిళా పోలీసు స్టేషన్ల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నా కొంత మంది ధోరణి మారడం లేదు. పల్లెల్లో ఇలాంటివి ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వాటిని నియంత్రించాల్సిన పోలీసులు ఆ దిశగా కృషి చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పెట్రోలింగ్, నిఘా వ్యవస్థ ఏమైంది?
జిల్లా కేంద్రాలతో పాటు పురపాలికలు, మండలాల్లో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు ఈ మధ్య దానిని సరైన విధంగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నల్గొండకు మహిళా పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే రెండు రోజుల క్రితం జంట హత్యలు జరగడం పెట్రోలింగ్ వ్యవస్థ లోపానికి అద్దం పడుతోంది. రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మద్యం తాగి గొడవకు దిగి అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘర్షణలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరోవైపు బెల్టు దుకాణాలు హత్యలు, రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా అధికారుల దన్నుతోనే వెలిసిన బెల్టు దుకాణాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత మద్యం దొరకడం, వీరికి పోలీసుల అండదండలు ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు తరుచూ పునరావృతమవుతున్నాయి. ఇప్పటికైనా పెట్రోలింగ్ వ్యవస్థతో పాటు నిఘా వర్గాలు సరైన విధంగా స్పందించి హత్యలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇటీవల జరిగిన హత్యలు
- మునుగోడు మండలం కొరిటికల్‌లో అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య (08.01)
- తిప్పర్తి మండలం పజ్జూరులో భూ తగాదాలతో వ్యక్తి హత్య ( 14.01)
- నల్గొండ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో వ్యక్తి హత్య (15.01)
- నల్గొండ కలెక్టరేట్‌కు సమీపంలో డబ్బుల కోసం ఇద్దరు వలస కూలీలను హత్య చేసిన ఆటోడ్రైవర్లు (25.01)
- అప్పుతీర్చడం లేదని మిర్యాలగూడలో బావను హత్య చేసిన సొంత బావమరిది (22.01)
- నాంపల్లి మండలం పాటిమీదిగూడెంలో భూ తగాదాలతో పట్టపగలే వ్యక్తి హత్య (26.01)
- నాంపల్లి మండలం దేవత్‌పల్లిలో భార్యను హత్య చేసిన భర్త( 26.01)
భూ పంచాయితీలపై నిఘా
గత కొన్ని రోజులుగా జిల్లాలో జరుగుతున్న హత్యలు వేటికవి సంబంధం లేనివి. భూ పంచాయతీలపై రెవెన్యూ అధికారులతో కలిసి నిఘా వేస్తున్నాం. స్టేషన్‌లకు వచ్చే పంచాయతీలపై ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. రాత్రివేళల్లోనూ పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. - ఏవీ రంగనాథ్, ఎస్పీ, నల్గొండ
ఇదీ చూడండి: దారుణం: పట్ట పగలు.. ప్రాణం తీసిన పగలు