నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిని ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలతో అభ్యర్థి ఎంపిక గురించి కేసీఆర్ చర్చించారు. సర్వేల విశ్లేషణ, ఆశావహుల బలాబలాలు, ఎన్నికల ప్రచారం, నేతలకు బాధ్యతలపై సమాలోచనలు చేశారు. పార్టీ అభ్యర్థిత్వాన్ని పలువురు ఆశిస్తున్నా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నామని పార్టీ నేతలకు తెలియజేశారు. ప్రస్తుతం రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూలు వెంటనే వెలువడితే దానికి అనుగుణంగా ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ఎన్నికల ప్రచారానికి బాధ్యులను ఎంపిక చేస్తారు. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, మరోవైపు ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహిస్తారు.
సభ్యత్వ నమోదుకు నేడు చివరి రోజు
తెరాస సభ్యత్వ నమోదు ఆదివారంతో ముగియనుంది. హైదరాబాద్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులు సభ్యత్వ నమోదులో విఫలం కావడంతో అక్కడ 3 రోజులుగా పార్టీ ముఖ్యనేతలు దృష్టి సారించారు. సభ్యత్వ నమోదు గడువు ముగిసిన వెంటనే కంప్యూటరీకరణ చేపడతారు. ఆ తర్వాత సీఎం లేదా కేటీఆర్ సభ్యత్వ నమోదు వివరాలను వెల్లడిస్తారు.