CHERUVUGATTU TEMPLE: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతిసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్లను పర్వత వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. మెుదట వీరముష్టి వంశీయులుతో పూజలు నిర్వహించి అగ్నిగుండాలను ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఒకరి తరువాత ఒకరిని నిప్పులపై నడిచే విధంగా ఏర్పాట్లు చేశారు.
భక్తులు హరహర శంభో నామస్మరణలతో నిప్పుల్లో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం కళ్యాణం తరువాత తాము పండించిన పంటను స్వామి వారికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే తమకు తమ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని... పంటలకు చీడపీడలు సోకకుండా బాగా పంటలు పండుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ప్రత్యేక ఆకర్షణగా శివసత్తులు
ఈ కార్యక్రమంలో శివసత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రాష్టంలో ఎక్కడ ఉన్నా వారు అగ్నిగుండాల కార్యక్రమానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. వేల సంఖ్యలో వచ్చిన శివసత్తులు అగ్ని గుండాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆడిపాడి సంబరాలు చేసుకున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, పాలకమండలి, దేవాదాయ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కన్నుల పండువగా జడల రామలింగేశ్వరుని కల్యాణం