రైతులపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. వారి బాధలు కనిపించడం లేదా అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందినప్పటికీ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం మూలంగా.. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి చండూర్ మండలంలోని కొండాపురం, చండూర్ కొనుగోలు కేంద్రాల్లో రైతులను మనోహర్ రెడ్డి కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిచి మొలకలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..
ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట కోత విధించడం, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు సక్రమంగా చేయకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వేసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు, మిల్లర్ల కుమ్మక్కై రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వీరి ఆగడాలను ప్రశ్నించిన రైతుల ధాన్యాన్ని కొనకుండా పక్కనపెడుతూ ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. కల్లాల వద్ద గన్నీ బ్యాగులను సమకూర్చుకోవడం కూడా రైతులకు సమస్యగా తయారైందని.. ఈ సమస్యలన్నింటిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: హెటెరోలో ‘స్పుత్నిక్ వి’ టీకా ఉత్పత్తి ప్రారంభం