Bandi Sanjay on KCR Meeting: మునుగోడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేసీఆర్ మునుగోడు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఏ కుల వృత్తుల వారికి నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ తప్పు చేయని కేసీఆర్.. ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు అంత రహస్యంగా దాస్తున్నారని దుయ్యబట్టారు.
ఇన్నిరోజులు ప్రగతిభవన్లో గంపకింద పెట్టి దాచి.. ఇప్పుడు తనతో పాటు హెలీకాప్టర్లో తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం భాజపాకు లేదని పేర్కొన్న ఆయన.. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత 38 ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొనుగోలు చేసినట్లు కేసీఆర్ కొనుగోలు చేశారని ఆయన ధ్వజమెత్తారు. మోటార్లకు మీటర్లు పెట్టామని భాజపాని విమర్శించిన కేసీఆర్.. మేము ఎక్కడ మీటర్లు పెట్టామో చెప్పాలని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన తరువాత ప్రభుత్వం ఏదో ఒక రోజు కరెంట్ ఛార్జీలు పెంచడం ఖాయమని ఆయన అన్నారు.
"ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ తప్పు చేయని కేసీఆర్ ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు అంత రహస్యంగా దాస్తున్నారు. ఇన్ని రోజులు ఆ ఎమ్మెల్యేలను ప్రగతిభవన్లో గంపకింద పెట్టి దాచి ఇప్పుడు తనతో పాటు హెలీకాప్టర్లో తీసుకొచ్చారు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత 38 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొనుగోలు చేసినట్లు కేసీఆర్ కొనుగోలు చేశారు".- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: