Bandi Sanjay on Trs won Munugode Bypoll: మునుగోడులో అధికార తెరాస ఎన్ని ప్రలోభాలకు పాల్పడినా... 40 శాతం ఓట్లతో భాజపా పుంజుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఉపఎన్నికల్లో గెలుపుతో తెరాస అహంకారం ప్రదర్శిస్తుందని ప్రజలు తెలుసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు మునుగోడు సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ఓటమిపై సమీక్ష చేసుకుని.. అధికారమే లక్ష్యంగా అభివృద్ధికోసం పనిచేస్తామన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక యుద్ధం చేశారని బండి సంజయ్ అన్నారు. ఒక మంచి ఆలోచనతో రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరారని తెలిపారు. మునుగోడులో భాజపాకు 40 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి హీరోలా పోరాటం చేశారన్న ఆయన.. తెరాస భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జ్‌లు, బైండోవర్లు, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గకుండా కార్యకర్తలు పనిచేశారన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తామన్న బండి సంజయ్.. ఓడిపోతే కుంగిపోం.. గెలిస్తే పొంగిపోం అని వ్యాఖ్యానించారు.
'ఇతర పార్టీల నుంచి గెలిచిన 12 మందిని తెరాసలో చేర్చుకున్నారు. వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పుకోరే దమ్ముందా? మునుగోడు గెలుపు కేసీఆర్‌దా? కేటీఆర్‌దా? హరీశ్‌రావుదా? సీపీఐదా, సీపీఎందా? కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిదా? ఎవరిదో చెప్పాలి. ఒక్క రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తే వచ్చింది 11వేల మెజార్టీ. ఒక్కో పోలింగ్ బూత్‌కు తెరాస ఎమ్మెల్యే పనిచేస్తే.. భాజపా తరఫున కార్యకర్త పనిచేశారు. ఒక్కో తెరాస ఎమ్మెల్యే.. భాజపా కార్యకర్తతో సమానం. ఉప ఎన్నిక వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మునుగోడు గెలుపుతో తెరాస నేతల్లో మళ్లీ అహంకారం మొదలైందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ గెలుపు తర్వాత అనేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెరాస నేతల వ్యాఖ్యలను మునుగోడు వాసులు చీదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భాజపాను ఎదుర్కొనేందుకు తెరాస, సీపీఐ, సీపీఎం పరోక్షంగా కాంగ్రెస్ కలిసి పనిచేశాయని ఆరోపించారు. మునుగోడు ఓటమితో భాజపా కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని సూచించారు. మునుగోడు ఓటర్లకు బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు గెలుపు.. కొందరు పోలీసు అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ది అని ధ్వజమెత్తారు. ఎక్కడా కూడా తెరాస డబ్బులు పట్టుబడకుండా.. పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు, ఎమ్మెల్యేల కాన్వాయ్‌ల ద్వారా డబ్బు తరలించారన్న ఆయన.. ఉప ఎన్నిక కోసం తెరాస రూ.వెయ్యి కోట్లు పంచిందని బండి సంజయ్ ఆరోపించారు.
ఇవీ చదవండి: