నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అటవీ శాఖ కార్యాలయం ఎదుట గిరిజన రైతులు ధర్నా చేపట్టారు. పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్దిన్నె గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో నాటిన 1200 మామిడి మొక్కలను అటవీ శాఖ అధికారులు నరికేశారని ఆరోపించారు. గత 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని చెప్పినా.. వినకుండా మొక్కలను ధ్వంసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మామిడి మొక్కలను నరికివేయడం వల్ల తమకు దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపించారు. మొక్కలను ధ్వంసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే మామిడి మొక్కలను నాటించాలని.. తమను ఆదుకోవాలని కోరారు. గిరిజన రైతులపై అధికారులు దౌర్జన్యం చేస్తే ప్రతి దాడులు తప్పవని వారు హెచ్చరించారు.