శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్కేంద్రంలో సంభవించిన ప్రమాద ఘటనపై తుది నివేదిక ఇచ్చేందుకు విచారణ కమిటీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా మరోమారు విచారించేందుకు సంబంధిత ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. రెండు రోజులపాటు విచారించి సమాచారాన్ని రాబట్టాలని కమిటీ నిర్ణయించింది.
బుధవారం కొంత మంది జెన్‌కో అధికారులను కమిటీ సభ్యులు విచారించారు. మిగిలిన వారిని గురువారం విచారించనున్నారు. ఆగస్టు 20న రాత్రి పవర్ హౌస్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో డీఈ, ఏఈలు, ప్రైవేటు సంస్థ సిబ్బంది కలిసి మొత్తం 9 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. రూ.కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. అప్పటి నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.