నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణానికి చెందిన గాండ్ల కామరాజు, శైలజాల కుమారుడు సాయి శరత్ అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. న్యాయమూర్తి కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న శరత్.. చివరకు తన కలను సాకారం చేసుకున్నాడు. శనివారం వెలువడిన ఫలితాల్లో సత్తా చాటాడు. జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు శరత్‌కు మిఠాయిలు తినిపించారు. శుభాకాంక్షలు తెలిపారు.
నేను 2018లో ఎల్ఎల్బీ పాసయ్యాను. మా నాన్న కోరిక మేరకు రెండున్నర సంవత్సరాలు ప్రాక్టిస్ చేశాను. 2019లో మొదటిసారి జేసీజేగా పరీక్ష రాశాను. అప్పుడు క్వాలిఫై కాలేదు. అప్పటి నుంచి మరింత పట్టుదలగా.. రోజుకు 12 నుంచి 16 గంటల పాటు చదివి 2020లో మళ్లీ పరీక్ష రాశాను. నిన్న విడుదలైన ఫలితాల్లో నేను జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైనట్లు తెలిసింది. ఈ సమయంలో మా నాన్న ఉంటే చాలా సంతోషించేవాడు. ఎందుకంటే మా నాన్న జడ్జి కావాలని మా తాతయ్య కోరిక. కానీ మా నాన్న జడ్జి కాలేకపోయారు. అందుకే నన్ను జడ్జిగా చూడాలనుకున్నారు. ఇప్పుడు ఆయన ఉండుంటే చాలా సంతోషించేవారు. కుటుంబసభ్యులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. -సాయి శరత్
శరత్ తండ్రి కామరాజు కొల్లాపూర్ జూనియర్ సివిల్ కోర్టులో న్యాయవాదిగా చేసేవారు. కరోనాతో ఇటీవల ఆయన మృతి చెందారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఇప్పుడు శరత్ అండగా ఉంటాడని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: cabinet meeting: ఈ నెలాఖరులోగా రూ.50వేలలోపు పంట రుణాలు మాఫీ..