Problems in BC Boys Hostel Veldanda : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda ) ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహాన్ని(BC Boys Hostel) .. 1988లో 12 గదులతో నిర్మించారు. అప్పట్నుంచి ఎందరో విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. ఏటా విద్యార్ధుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో మరో 6 గదులు అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 18 గదుల్లో 4 శిథిలావస్థకు చేరగా.. ఒకటి కార్యాలయానికి, మరోకటి కూరగాయల నిల్వకు కేటాయించారు. మూడు నుంచి పదో తరగతి వరకు 227 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు.
Lack of Facilities in Veldanda BC Boys Hostel : కాలక్రమేణా ఈ వసతిగృహం గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని గదులు పెచ్చులూడి ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. గోడలు పగుళ్లు తేలి.. కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ గదుల్లోనే పిల్లలు చదువులు కొనసాగించాల్సి వస్తోంది. వసతిగృహంలో కిటికీలు, తలుపులు పూర్తిగా పాడైపోయాయి. కొన్నింటికి అసలు తలుపులే లేవు.
"ఎప్పుడు ఈ భవనం కూలిపోతుందో తెలియదు. ఫ్యాన్లు, లైట్లు లేవు. ఎప్పుడు కూలుతుందో తెలియక భయంగా కాలం గడుపుతున్నాం. డైనింగ్‌హాల్ లేకపోవడంతో ఆరుబయటనే భోజనం, అల్పాహారం చేస్తున్నాం." - విద్యార్థులు
కరెంట్ పోతే.. దోమల కుట్టి జ్వరాల బారిన పడుతున్నామని.. నిద్రపోవడానికి రోజూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుప్పట్లను కిటీకీలకు అడ్డుపెట్టి చలికి వణుకుతూ నిద్రిస్తున్నామని చెబుతున్నారు. భవనం నిర్మించి చాలాకాలం కావడంతో.. విద్యుత్ వైరింగ్ దెబ్బతిని.. గోడలు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. గదుల్లో ఫ్యాన్లు పనిచేయక.. పంకా తిరిగే ఒక్కోగదిలో 20 మంది విద్యార్థులు సర్దుకుని నిద్రపోతున్నారు.
ఈ ఏడాది ప్లేట్లు , గ్లాసులు కూడా సరఫరా చేయకపోవడంతో.. ఇంటి నుంచి తెచ్చుకున్న వాటినే విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. తాగునీటికి మంచినీళ్లు లేక, బోరునీటినే వాడుతున్నామని వారు వాపోయారు. వర్షాకాలంలో వసతి గృహం ఆవరణ చెరువును తలపిస్తోంది. ఆర్వో ప్లాంటు మూతపడటంతో.. తాగేందుకు మంచినీరు కూడా కరువైంది. భోజనం చేసేందుకు డైనింగ్‌హాల్ లేక ఆరుబయటే.. నేలపైన విద్యార్థులు అల్పాహారం చేస్తున్నారు.
మరోవైపు 200 మంది విద్యార్ధులున్న ఈ వసతిగృహంలో.. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేయాల్సి వస్తోంది. హాస్టల్ ప్రహరీ కూలి లోపలికి కుక్కలు, పందులు చొరబడుతున్నాయి. గ్రామంలోని ప్రధాన మురుగుకాల్వ.. వసతి గృహం ఆవరణలోంచే వెళ్లడంతో దుర్వాసన రావడంతోపాటు దోమలకు అడ్డాగా మారింది. దీనివల్ల విద్యార్ధులు రోగాల బారిన పడుతున్నారు. ఈ సమస్యలన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వసతిగృహ అధికారి చిలకమ్మ తెలిపారు.
"వసతిగృహం పక్కనే ఉన్న కాలువ ఉంది. దానివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భవనంలోని కొన్ని గదులు పెచ్చులూడి కింద పడుతున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం." - చిలకమ్మ, వసతిగృహ అధికారి
ఇప్పటికైనా బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఈ బాలుర వసతి గృహ సమస్యలపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు. తగిన నిధులు విడుదల చేసి తాత్కాలికంగానైనా సమస్యలు పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.
TU Hostel Problems : ఇదేందయ్యా ఇది.. హాస్టలా..? సమస్యల అడ్డానా..?