నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహార తీరుపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు ఎండగడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది. ఇటీవలే జరిగిన ఈ సంఘటన ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడైంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఘటనలో పీహెచ్సీ బయటి తలుపులు తెరిచి ఉండటం వల్ల చికిత్స నిమిత్తం లోపలికి వెళ్లిన శివ స్వాములకు తాళం వేసిన తలుపులే దర్శనమిచ్చాయి.
ఏ గదికి వెళ్లినా ఒక్కరంటే ఒక్క వైద్య సిబ్బంది లేకపోవడం రోగులను విస్మయానికి గురిచేస్తోంది. అన్ని తలుపులకు తాళాలు వేసి ఉండటం వల్ల శివ స్వాములు అవాక్కయ్యారు. నల్లమల ప్రాంతం శ్రీశైలం ప్రధాన రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని.. యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుందని పదేళ్ల క్రితమే అప్పాపూర్ పీహెచ్‌సీని వటవర్లపల్లికి మార్చారు.
ఉన్న ఒకే వైద్యుడు బదిలీపై...
ఇక్కడ డా. సురేష్ బాబు వైద్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను లింగాలకు డిప్యూటేషన్‌పై మార్చడం వల్ల లింగాలలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మాత్రం గైర్హాజరవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పీహెచ్సీలో ఉండాల్సిన ఏఎన్ఎం, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ అసిస్టెంట్, అటెండర్ తమ విధులకు సరిగా హాజరు కావట్లేదు. వీరందరూ తమ విధులకు రోజు వారీగా... ఎవరో ఒకరు వచ్చి తూతూమంత్రంగా వచ్చి ఉదయం 11 వరకు ఉండిపోతున్నారని స్థానికుల వాపోతున్నారు.
ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై డా. సురేష్ బాబును అడగగా వటవర్లపల్లి పీహెచ్సీలో శుక్రవారం నాలుగు గంటల వరకే విధులు నిర్వహించామని తెలిపారు. శివ స్వాములు 4 తర్వాత వచ్చి ఉండవచ్చని వైద్యుడు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : ప్రైవేటు బండి వస్తోంది... రెగ్యులర్ బండి పక్కకు జరపండి!