వచ్చే అక్టోబరు నాటికి రైతు వేదిక భవనాల నిర్మాణం పూర్తి చేయాలని... అందుకుగాను ఆయా గ్రామాల సర్పంచ్లు, గ్రామస్థులు సహకరించాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి కోరారు. కల్వకుర్తి డివిజన్ పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, చారకొండ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లతో భేటీ అయ్యారు. కల్వకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతు వేదిక భవన నిర్మాణాలపై చర్చించారు. వీటి ద్వారా ఒక క్లస్టర్ పరిధిలోని రైతులు పండించే పంటలు, అధిక లాభాలు పొందిన వారి వివరాలను ఇతర రైతులు తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు.
భవనాల నిర్మాణానికి ఇసుక కొరత ఉందని... ప్రత్యేక అనుమతులతో సరఫరా చేసేందుకు అధికారులు సహకరించాలని సర్పంచ్లుకోరారు. నిర్మాణాలు చేపట్టే క్రమంలో సర్పంచ్లు ఇతర పార్టీలకు చెందిన వారై ఉంటే అధికార పార్టీ వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఎంపీపీ సునీత తదితరులు పాల్గొన్నారు.