Governor Tamilisai Soundararajan: కొవిడ్ సోకిందని వైద్యులు వైద్యం నిరాకరించిన ఘటనలో అచ్చంపేట ఏరియా ఆసుపత్రి గేటు వద్ద సాధారణ ప్రసవంలో ఆడశిశువుకు జన్మనిచ్చిన చెంచు మహిళ కుటుంబసభ్యులతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్ చేసి మాట్లాడారు. తల్లి, బిడ్డల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని భరోసా ఇచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బాలింత నిమ్మల లాలమ్మ ఇంటిని సందర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ శివరాముకు గవర్నర్ ట్విట్టర్ ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండలం బాణాలకు చెందిన నిమ్మల లాలమ్మకు మంగళవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు కరోనా పరీక్ష చేయగా, పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో వైద్యులు ప్రసవం ఇక్కడ చేయలేమని, పీపీఈ కిట్లు కూడా లేవని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో నొప్పులు ఎక్కువవడంతో లాలమ్మను ఆమె వెంట ఉన్న అక్కాచెళ్లెలిద్దరూ ఆసుపత్రి గేటు వద్ద కాన్పు చేశారు. అనంతరం, పరీక్షలు నిర్వహించిన వైద్యులు తల్లి, బిడ్డలు క్షేమంగా ఉండటంతో ఇంటికి పంపించారు.
ఇదీ చదవండి: