కటకటాల వెనుక బంధీగా ఉన్న మేకను తోటి మేకొచ్చి... ఏమే లోపలున్నావని అడిగింది.. నన్ను వీళ్లు పట్టుకుని కట్టేశారని చెప్పింది.. ఏమే ఎందుకు కట్టేశారని అడిగింది... నేను మొక్కను తిన్నానని బంధించేశారని చెప్పింది.. ఆశ్చర్యపోయిన మరో మేక... అదేంటి మనం తినేదే మొక్కలు కదా.. వాటిని తింటేనే కట్టేశారా అని కళ్లు పెద్దవి చేసి అడిగింది.. ఆ మొక్క... అదేదో హరితహారంలో పాతిన మొక్కంట. నాకు తెలియకుండా మంచిగా కనిపిస్తే లాగించేశా.. ఇంకేముంది ఓనలుగురు నా వెంటపడి పట్టుకుని ఇదిగో ఇక్కడ కట్టేశారని బోరున విలపించింది. ఇదేదే పిట్టకథ అనుకుంటే పొరపాటే.. హరిత హారంలో పాతిన మొక్కను తిన్న ఘటనలో ఓ మేకను మున్సిపాలిటీ అధికారులు బంధించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 7వ విడత హరితహారంలో భాగంగా... 7, 8 వార్డుల్లో అధికారులు మొక్కలు నాటారు. అయితే ఏడో వార్డులోని టైలర్ రంగస్వామికి చెందిన 4 నెలల మేక పిల్ల... హారితహారంలో పాతిన మొక్కను తినేసింది. గమనించిన మున్సిపాలిటీ అధికారులు ఆ మేకపిల్లను పట్టుకుని గ్రంథాలయ భవనంలో బంధించి తాళం వేశారు.
విషయం తెలుసుకున్న మేక యజమాని రంగస్వామి.. తన మేకపిల్లను వదిలేయమని అధికారులను వేడుకున్నాడు. మొక్కను తన మేక తిన్న విషయం తనకు తెలియదని... ఇంకో సారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పాడు. కానీ అధికారులు అంగీకరించలేదు. మొక్కను తిన్న మేకకు రూ.5వేలు జరిమానా విధించారు. తాను పేదవాడినని.. అంత ఇచ్చుకోలేనని.. కనీసం ఆ మేకను అమ్మినా అంత రాదని వాపోయాడు.
తగ్గేది లేదు.. కట్టాల్సిందే..
అయితే జరిమానా విషయంలో తగ్గేది లేదని.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం మొక్కలను మేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి స్పష్టం చేశారు.