The story of four orphan children in Nagar Kurnool district: కొన్నికొన్ని సందర్భాలలో కష్టాల్లో ఉన్న వారిని అయినవాళ్లే చేరదీయరు. బంధువుల మాట ఇక సరేసరి. అయితే నాగులపల్లి తండావాసులు మాత్రం అమ్మనాన్న కోల్పోయి అనాథలైన నలుగురు చిన్నారులకు అన్నీతామై అండగా నిలుస్తున్నారు. మానవత్వం జాడేది అని అడిగిన వారికి దాని చిరునామాని చూపుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం నాగులపల్లి తండాలో నివాసముండే స్వామి, చంద్రమ్మ దంపతులు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండేళ్లక్రితం చంద్రమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో తండ్రే పిల్లల ఆలనాపాలనా చూసేవాడు. అయితే నాలుగురోజుల క్రితం స్వామికి మూర్ఛవ్యాధి వచ్చి చనిపోయాడు. దీంతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు. దిక్కుతోచని స్థితిలో అభాగ్యులుగా మిగిలిపోయారు. తలదాచుకోవడానికి కనీసం సరైన గూడు సైతం లేకపోవడంతో రోడ్డు మీద పడ్డారు.
పిల్లలకు అవ్వ, తాత ఉన్నప్పటికీ వృద్ధాప్యంతో వారు ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో తండావాసులే పిల్లలకు బాసటగా నిలిచారు. తలాకొంత డబ్బు జమచేసి పిల్లల అవసరాల నిమిత్తం ఉంచారు. నిత్యావసరాలు కొనుగోలు చేసి ఇచ్చారు. పిల్లలంతా చిన్నారులు కావడం అందులోనూ ముగ్గురు ఆడపిల్లలు కావడంతో వారి ఆలనాపాలనా చూసేదెవరని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఎలాగైనా స్పందించి వారికి సహాయమందించాలని కోరుతున్నారు. వారు ఉండటానికి సరైన ఇల్లు లేకపోవడంతో రెండుపడకల గది మంజూరుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
"మా అమ్మ రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. మా నాన్న రెండు రోజుల క్రితం చనిపోయాడు. నాకు ఇద్దరు చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నాడు. మమ్మల్ని ఆదుకోనేవారు ఎవరు లేరు. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నాను." -పింకీ...అమ్మాయి
ఇవీ చదవండి: