Akshara Vanam students: కల్వకుర్తిలో భారతీయ వికాస్ సంగం, అక్షరవనం విద్యా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు భారతీయ విద్యా ఉత్సవ్ కార్యక్రమం జరిగింది. వందేమాతరం ఫౌండేషన్ ఆధర్వంలో నడుస్తున్న అక్షరవనం అందుకు వేదికైంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జరిగిన సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి నిపుణులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు ఇలా 300 నుంచి 600 మంది వరకూ హాజరయ్యారు.
ఇంత మందికి భోజన వసతి సౌకర్యాలను కల్పించడంతో పాటు, అన్ని రకాల పనులను చూసుకోవడం మామూలు విషయం కాదు. కానీ అక్షరవనంలో చదువుతున్న పిల్లలే అక్కడ అన్నిపనులు చూసుకున్నారు. వీళ్లందరి వయసు 16ఏళ్ల లోపే. పక్కా ప్రణాళికతో బృందాలుగా ఏర్పడి ఎంతమంది సందర్శకులు వచ్చినా లోటు లేకుండా భోజనం, తాగునీరు, వసతి తదితర ఏర్పాట్లు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
చేపట్టాల్సిన పనులను 16 విభాగాలుగా విడగొట్టి, ప్రతి విభాగానికి నాయకున్ని ఎన్నుకుని వారి పర్యవేక్షణలో పనులు పూర్తి చేశారు. వండేది, వడ్డించేది అంతా 16 ఏళ్లలోపు విద్యార్థులే. ఒక్కో విద్యార్థికి ఒక్కో రోజు, ఒక్కో పని అప్పగిస్తారు. ప్రతి బృందంలో ఒకరికి టాకీవాకర్ ఉండటంతో ఎక్కడ ఏం జరుగుతున్నా, లోటు ఉన్నా వెంటనే సమాచారం అందజేసి తక్షణమే సమస్యను పరిష్కరిస్తారు.
బళ్లో ఇచ్చిన హోం వర్కును పూర్తి చేయడానికే నానా తంటాలు పడే విద్యార్థి వయసులో.. ఇన్ని పనులు ఎలా చేశారని ఆలోచిస్తున్నారా? అక్షరవనం విద్యార్థులకు అవి రోజూ చేసే పనులే. చదువుతో పాటు వాళ్లు నిత్యం ఆకుకూరలు, కూరగాయల్ని పెంచుతారు. గో పాలన, గార్డెనింగ్, వంట, పారిశుద్ధ్యం అన్నిపనులు వారి దైనందన జీవితంలో భాగమే. అందుకే ఎంతమంది వచ్చినా సరే, ఎలాంటి కార్యక్రమం ఇచ్చినా సరే, చిటికెలో చక్కబెట్టే సామర్థ్యాలు వారికి అలవడ్డాయి.
పిల్లలంటే చదువు మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలూ బాల్యం నుంచే అలవరచుకోవాలనే అంశాన్ని అక్షరవనం ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. వాటి ఫలితమే విద్యార్థి దశలోనే వారి కాళ్లపైన వాళ్లు నిలబడే సామర్థాలు అలవడ్డాయంటారు అక్షరవనం వ్యవస్థాపకులు మాధవరెడ్డి.
నిత్యం బళ్లు, హోం వర్కులు లేదంటే మొబైల్ ఫోన్లపై కాలక్షేపం చేసే పిల్లలున్న ఈ రోజుల్లో.. 16 ఏళ్లలోనే అన్ని రకాల జీవన నైపుణ్యాలు నేర్పుతున్న అక్షరవనం విద్యావిధానం నేటి పాఠశాలలకు ఆదర్శం. అనుసరణీయం.
ఇవీ చదవండి: