లాక్డౌన్ సమయంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు వచ్చిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.... వైన్ షాపుల యాజమాన్యంతో కలిసి విందులో పాల్గొని అడ్డంగా బుక్కయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని కొందరు వైన్‌షాపుల యజమానులు... బెల్టు షాపులు, గొలుసుకట్టు దుకాణాదారులకు రెండింతలు చేసి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రెండు రోజులపాటు పట్టణంలో తనిఖీలు చేశారు.
వైన్‌షాప్ యజమానులు, అధికారులతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజులుగా కోళ్ల షెడ్డు వద్ద విందులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళగా... అధికారులు పొలాల్లోని గడ్డివాములు, చెట్ల పొదల్లో తనిఖీ చేసినట్లు హడావుడి చేశారు. లోపలికి వెళ్లి చూడడంతో అసలు విషయం బయటపడింది.
సదరు యజమానులు వారికి రెండు రోజులుగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. మద్యం దుకాణాలను తనిఖీ చేయడానికి వచ్చి యజమానులతో కలిసి విందులు చేసుకుంటే ఎలా పారదర్శకంగా తనిఖీలు నిర్వహిస్తారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.