వరంగల్ నగరాన్ని వరద ముంపు వీడటం లేదు. ఎన్టీఆర్నగర్, లక్ష్మీగణపతినగర్, బృందావన్ కాలనీ, మధురానగర్, ఎస్.ఆర్.నగర్ తదితర కాలనీల్లోని ఇళ్లను వరద చుట్టిముట్టింది. నగర కార్పొరేషన్ విపత్తు నిర్వహణ బృందాలు.. బాధితులను బోట్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించాయి. నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య.. ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
హనుమకొండలోని ప్రధాన రహదారులపైకి వరద ముంచెత్తి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ నుంచి కరీంనగర్ వెళ్లే భీమారంలోని జాతీయ రహదారి వద్ద వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనదారులు ప్రయాణం చేస్తున్నారు. అమరావతినగర్, గాంధీనగర్, సమ్మయ్యనగర్, వడ్డేపల్లి ఎస్సీకాలనీ, పరిమళకాలనీ, వంద ఫీట్ల రోడ్, గోపాలపూర్, జవహర్ కాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిలిచిన రాకపోకలు..
వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట, దుగ్గొండి మండలంలోని వాగులు పొంగి.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పరకాల పట్టణం జలమయమైంది. దామెర చెరువు అలుగు పారి.. శ్రీనివాసనగర్ కాలనీ నీట మునిగింది. ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ చెరువు మత్తడి దూకటంతో వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ, ములుగు వైపు వెళ్లే వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి.
పొంగుతున్న చెరువులు..
వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పంతిని వద్ద నీటి ప్రవాహంలో లారీ చిక్కుకుంది. ఉప్పరపల్లి చెరువు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోని వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. కటాక్షపూర్ చెరువు అలుగుపారి హనుమకొండ జిల్లా నుంచి ములుగు జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి.
అప్రమత్తంగా ఉండండి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు మండలాల్లోని వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వరద నీటితో సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలోనూ వర్షాలు కొనసాగాయి. వాగుల ఉద్ధృతితో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పత్తి, మిరప తోటలు నీట మునిగాయి. వర్షాల తీవ్రత దృష్ట్యా అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు జలకళ సంతరించుకుంది. సరస్సు నిండుకుండలా మారి తీగల వంతెన నీట మునిగింది. భద్రకాళీ చెరువు మత్తడిపోస్తూ సరికొత్త ప్రకృతి అందాలు సంతరించుకుంది.
ఇదీ చూడండి: Rain Effect in Sircilla: చెరువులైన రహదారులు.. వరదలో కొట్టుకుపోయిన విగ్రహాలు