పోడు భూములను సాగు చేసుకుని 20 ఏళ్లుగా పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాకుంటున్నారని.. భూమిని లాక్కొని మా పొట్టలు కొట్టవద్దని అటవీ శాఖ అధికారులను వేడుకుంటున్నారు. అయినప్పటికీ తమను బెదిరిస్తూ భూముల్లో ట్రెంచీలు కొడుతున్నారని వాపోయారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్యపల్లిలో పోడు భూములపై అటవీశాఖ అధికారుల తీరును వ్యతిరేకిస్తున్నారు.
మా గ్రామంలో 80 కుటుంబాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన 15 కుటుంబాలకు భూమి లేకపోవడంతో 20 ఏళ్ల క్రితమే సాగు చేసుకున్నామని గిరిజనులు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది అటవీశాఖ అధికారులు బెదిరింపులు, భయబ్రాంతులకు గురి చేసే వారని ఆరోపిస్తున్నారు. అయినా సరే తాము వదిలి పెట్టి పోయేవారం కాదని అన్నారు. ఇప్పుడు వచ్చిన అధికారి సుజాత మా మీద కేసులు పెడుతోందని గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. పోడు భూమిలో సాగు చేసుకుంటున్న 15 మంది రైతులకు ఎక్కడైనా భూమి ఉంటే.. అటవీశాఖ అధికారులు తహసీల్దార్ వద్దకు వెళ్లి మా భూములు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న తాము ఈ భూమిని వదిలిపెట్టి వెళ్లమని.. లేనిపక్షంలో చావడానికైనా సిద్ధమేనని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: Harish Rao: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల సర్వే పనులు ప్రారంభం