ములుగు మంగపేట మండలం టీచర్స్ కాలనీకి చెందిన చిలుకమర్రి ప్రవీణ్ కుమార్(34) ఓ బ్యాంకులో క్యాషియర్. ఇటీవలే కమలాపురంలో అద్దె ఇల్లు తీసుకుని.. భార్య ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నాడు. శనివారం బ్యాంకు సెలవు కావటంతో.. దైవ దర్శనానికి వెళ్లి కుటుంబంతో సరదాగా గడపాలనుకున్నాడు. అందులో భాగంగానే.. అతని ద్విచక్రవాహనంపై భార్య హిమబిందు, కూతురు నిత్య , కుమారుడు సాత్విక్‌తో కలిసి మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి బయలుదేరారు.
క్షణాల్లోనే ..
సరదాగా .. వాళ్లు ప్రయాణం ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే మృత్యువు ట్రాక్టర్ రూపంలో దూసుకొచ్చింది. మంగపేట నుంచి కమలాపూర్‌కు ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ ప్రవీణ్ ఛాతిపై నుంచి పక్కనే ఉన్న టైలర్ షాపులోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి.
కలచివేసింది..
మృతుడి భార్య... భర్త మృతదేహంపై పడి రోదించటం అక్కడివారిని కలచివేసింది. అక్కడ తన తండ్రి చనిపోయాడని తెలియక అమాయకంగా తిరుగుతున్న చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్ మృత దేహన్ని ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: వృక్ష వేదం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది: కవిత