రామప్ప చెరువు నుంచి పాకాల చెరువుకు రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు చేపట్టిన పనుల అంచనా విలువను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. పాకాల చెరువు కింద ఉన్న 15వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు ములుగు నియోజకవర్గంలోని ఎనిమిది వేలు, నర్సంపేటలోని ఏడువేల ఎకరాలకు నీరందించేలా దేవాదుల ఎత్తిపోతలలో కరకవాగు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రోళ్లపాడు చెరువు వరకు పైప్లైన్ పనులను చేపట్టారు. ఈ పనులకు సంబంధించి 14 మిల్లీమీటర్ల మందంతో రెండున్నర మీటర్ల వ్యాసంతో పైపులు వేసేలా అంచనా విలువను రూ.132 కోట్ల నుంచి రూ.222 కోట్లకు పెంచారు.
మళ్లీ టెండర్లు..
వరంగల్ జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల పరిధిలో గోదావరి నదికి ఇరువైపులా కట్టల నిర్మాణం, మరమ్మతుల పనులకు సంబంధించిన ఒప్పందాన్ని ముగించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇంజినీర్ల ఉమ్మడి తనిఖీ నివేదిక ప్రకారం ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. చేసిన పనుల్లో లోపాలకు సంబంధించి కోటి రూపాయలను గుత్తేదారుకు బిల్లులు చెల్లించే ముందు రికవరీ చేయాలన్న ప్రభుత్వం... మిగిలిన పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీచూడండి: Palamuru -Rangareddy: ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ.. ప్రాజెక్టును స్వాగతించిన రైతులు