రాష్ట్రంలో వెలుగులు నింపే పేరుతో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు లాక్కొని వారి కుటుంబాల్లో ప్రభుత్వం చీకట్లు నింపిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వాసితులకు మద్దతు తెలిపేందుకు బుధవారం మణుగూరు బయలుదేరిన సీతక్కను ములుగు జిల్లా మంగమ్మపేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
'పోలీసులు అడ్డుకోవడం బాధాకరం'
దీనిపై పోలీసు చర్యలను సీతక్క ఖండించారు. బీటీపీఎస్ నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. గిరిజనులు, రైతుల భూములను ప్రభుత్వం అభివృద్ధి పేరుతో లాక్కుంటే.. వారెలా బతకాలని సీతక్క ప్రశ్నించారు. బీటీపీఎస్ నిర్మాణానికి శాశ్వత ఉద్యోగులను తీసుకోలేదని ఆరోపించారు.
ముందస్తు అరెస్టులు
ములుగు ఎమ్మెల్యే సీతక్క బిటిపిఎస్ నిర్వాసితులకు మద్దతు తెలిపేందుకు మణుగూరుకి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు కాంగ్రెస్, బీటీపీఎస్ నిర్వాసిత ఉద్యోగ సాధన కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు ఠాణాకు తరలించారు.