Medaram jathara 2022: మేడారం మహా జారతకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు జయజయధ్వానాలతో స్వాగతం పలుకుతుండగా.. పెద్దమ్మ సమ్మక్క అరుదెంచిన ఘట్టం కనుల విందైంది. చిలకల గుట్ట నుంచి పూజారులు సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించే క్రతువు డోలు వాయిద్యాలు, కొమ్ముబూరల మధ్య ఆద్యంతం కోలాహలంగా సాగింది. సరిగ్గా గురువారం రాత్రి 9.16 గంటలకు సమ్మక్క తల్లిని పూజారులు గద్దెపై ప్రతిష్ఠించారు. బుధవారం చిన్నమ్మ సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజు, భర్త గోవిందరాజు గద్దెలపై కొలువుతీరగా.. గురువారం సమ్మక్క సైతం విచ్చేయడంతో మేడారం జాతరకు పరిపూర్ణ శోభవచ్చింది. వారందరినీ ఒకేసారి చూసి భక్తులు పులకాంకితులవుతున్నారు. వనదేవతల దర్శనానికి జనం పోటెత్తారు. శుక్రవారం నిండు జాతర ఉంటుంది.
సమ్మక్క పూజారులు బుధవారం రాత్రే మేడారానికి పడమర దిక్కున ఉన్న వనం గుట్టకు వెళ్లి అక్కడే జాగారం చేశారు. గురువారం ఉదయం తిరిగి గద్దెకు చేరుకుని ప్రతిష్ఠకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, లక్ష్మయ్య (బొక్కెన్న), మునిందర్, మహేశ్, లక్ష్మణ్‌రావు, సమ్మయ్య తదితరులు; వడ్డెలు కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, దోబె నాగేశ్వర్‌రావు ప్రభృతులు దాదాపు 100 మందికి పైగా చిలకలగుట్టకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొక్కెర కృష్ణయ్య కుంకుమభరిణె రూపంలో అమ్మవారిని తీసుకుని పూజారులతో కలిసి గుట్ట కిందకు వస్తుండగా రాత్రి 7:14 గంటలకు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపి అమ్మ రాకపై భక్తులకు సంకేతాలిచ్చారు. కాల్పుల శబ్దం వినగానే చిలకలగుట్ట పరిసరాలు సమ్మక్క నామస్మరణతో ప్రతిధ్వనించాయి. చిలకలగుట్ట ముఖద్వారం చేరుకోగానే మరోసారి ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. దాదాపు 500 మంది పోలీసులు, ఆదివాసీ సంఘాల సభ్యుల భద్రత నడుమ సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకొస్తుండగా దారి పొడవునా రంగవల్లికలతో మహిళలు స్వాగతం పలికారు. సరిగ్గా రాత్రి 9.16 గంటలకు సమ్మక్క తల్లిని ప్రతిష్ఠింపజేశారు. పూజారులు గద్దెల ఆవరణలోని విద్యుత్తు దీపాలను ఆర్పివేసి పూజలు చేశారు. రాత్రంతా పూజారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి జాగరణ చేపట్టారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే సీతక్క ఈ మహాక్రతువులో పాల్గొన్నారు.
మేడారానికి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్..
అమ్మవార్ల దర్శనం కోసం సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారానికి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకుంటారు. ఎత్తుబెల్లంతో మొక్కులు చెల్లించి అమ్మవార్లను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వెళ్తారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం మేడారం వెళ్లనున్నారు.
జంపన్న తీరం.. జనసాగరం
జంపన్నవాగు తీరం గురువారం జనసాగరాన్ని తలపించింది. స్నానఘట్టాలు పూర్తిగా నిండిపోయాయి. శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. ఇక్కడ స్నానాల కోసం 6 వేల షవర్లను ఏర్పాటు చేశారు.గురువారం ఒక్కరోజే 12 లక్షల మంది స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: Medaram Jatara 2022: మేడారం హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం.. ధరలు, ప్రత్యేకతలివే..