ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ తుడుందెబ్బ వ్యవస్థాపకుడు దబ్బకట్ల నర్సింగరావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మరణం పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. 1995లో ఎంపీటీసీ ఎన్నికల్లో కొత్తూరు గ్రామం నుంచి ఎంపీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది ములుగు ఎంపీపీ పదవిని స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆదివాసీ ఎంపీపీలతో సమత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన అభ్యుదయ సంఘం పేరుతో దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆదివాసీ హక్కులపై భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
1996 ఆగస్టు 6న ఆదివాసీ సంఘాలను కలుపుకొని ఏటూరునాగారంలో ఆదివాసీ తుడుందెబ్బ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉద్యమాన్ని విస్తరించి ఆదివాసీ ప్రాంతంలో స్వయం పాలన డిమాండ్‌తో ముందుకు వెళ్లారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఎన్నో ఎకరాల భూములను గిరిజనేతర భూస్వాముల వద్ద నుంచి తీసుకుని ఆదివాసులకు పంచిపెట్టాడు. 1998లో వేల ఎకరాల భూములు ఉన్న భూస్వాములపై పోరాటం చేసిన కారం పార్వతి హత్యకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇంతటి మహోన్నత వ్యక్తి మృతిచెందడం పట్ల ఆదివాసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'తీసుకున్న భూమిని వినియోగించకుంటే చర్యలు తప్పవు'