గత రెండు నెలలుగా ఆసరా పింఛన్లు రావట్లేదని ఆరోపిస్తూ వృద్ధులు, దివ్యాంగులు రోడ్డెక్కారు. మేడ్చల్ మల్కాజ్గిరిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పింఛన్లు సకాలంలో రాకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. పింఛన్ కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్నప్పటికీ అధికారులు మాత్రం సకాలంలో పింఛన్లు ఇవ్వకపోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వారికి పింఛన్ డబ్బులు రాక మందులు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
పింఛన్ల కోసం ప్రతిరోజు గంటలకొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. కొందరికి రెండు నెలలు గడిచినా కూడా పింఛన్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల సకాలంలో పింఛన్లు అందించేందుకు కృషి చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: దారుణ హత్య: మొండెం, తల, కాళ్లు, చేతులు వేరుచేసి..