మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు బీరు సీసాతో విచక్షణ రహితంగా దాడి చేశారు. లయోలా కళాశాల సమీపంలో గుర్తుతెలియని దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. సూర్యనగర్‌కు చెందిన శ్రీకాంత్.. కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా గుర్తితెలియని వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు.
దాడి ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న శ్రీకాంత్‌ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.