తొమ్మిదేళ్లుగా నడవలేని స్థితిలో ఉన్న యువతికి కూకట్‌పల్లి ల్యాండ్‌మార్క్ ఆస్పత్రి వైద్యులు.. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. ఆ చికిత్స విజయవంతమై తిరిగి ఆమె తన కాళ్లపై తాను నడవగలుగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా ఘన్‌పూర్‌కు చెందిన కవిత(28)కు తొమ్మిదేళ్ల క్రితం ఓ ప్రైవేటు స్కూలులో పని చేస్తున్న సమయంలో మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. కొన్నాళ్లకు పూర్తిగా నడవలేని స్థితికి చేరుకుంది. ఆమె తల్లి, తమ్ముడు అన్ని పనుల్లో సాయం చేశారు. మూడేళ్ల క్రితం చికిత్స కోసం ల్యాండ్‌మార్క్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యానికయ్యే ఖర్చు మొత్తం కాకుండా కొంత భరిస్తే, మిగిలిన ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్లు చెప్పారు. దీంతో ఖర్చు భరించే స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స చేయించకుండానే వెనుదిరిగారు.
సీఎస్ఆర్ ద్వారా
కవిత సంవత్సరం క్రితం తిరిగి అదే ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లింది. ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారి పోవటం.. చికిత్స చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో ఆమెకు సీఎస్ఆర్ కింద ఉచితంగా ఆపరేషన్ చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం సిద్ధమైంది. యువతికి మోకాళ్లలో సమస్య ఉండటంతో ఇప్పటి వరకు మూడు శస్త్రచికిత్సలు నిర్వహించి రెండు మోకాళ్ల మార్పిడి చేశామని డాక్టర్ సుధీర్‌రెడ్డి వివరించారు.
మరికొద్ది రోజుల్లో కవిత పూర్తిగా కోలుకొని లేచి నడుస్తుందని డాక్టర్ ధీమా వ్యక్తం చేశారు. తన కుమార్తెకు ఉచితంగా వైద్యం చేసినందుకు ఆమె తల్లి గౌరమ్మ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
ఇదీ చదవండి: కొత్త రకం వైరస్ కలకలం.. ఒకే కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్