Grabbing government land in Hyderabad: హైదరాబాద్ నగర శివారు ప్రాంతం గాజులరామారంలో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. గత ఎనిమిది నెలల్లో దాదాపు రూ.500 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదారుల పరమైనా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ ప్రభుత్వ స్థలంపై కన్నేసి ప్లాట్లుగా మార్చి దర్జాగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతులో కొందరు స్థానిక నాయకుల పాత్ర ఉందని చెబుతున్నారు. ఆక్రమణదారులపై పీడీ యాక్టు నమోదుకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశించినా పోలీసులు, రెవెన్యూ అధికారులు భయపడుతున్నారంటే రాజకీయ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ విషయం: గాజులరామారం పరిధిలోని 329 సర్వే నంబరులో 255.28 ఎకరాలు, 342లో 378.22 ఎకరాలు.. మొత్తం 633.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. ఇందులో 60.5 ఎకరాలను జలమండలితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కొన్నేళ్ల కింద కేటాయించారు. మిగిలిన 573 ఎకరాలు కొన్నేళ్ల కిందటి వరకు ప్రభుత్వ అధీనంలో ఉండేవి. స్థానికంగా రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 1375 మందికి 1998లో కొంత భూమి అభివృద్ధి చేసి పట్టాలిచ్చారు.
ఈ కేటాయింపులపై ఆరోపణలు రావడంతో విచారణ చేసి.. రద్దు చేశారు. 50 మందికి మాత్రమే ఇళ్లు నిర్మించిఇచ్చారు. తరువాత నిఘా’ లేక క్రమేణా 476 ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించి 60 నుంచి 100 గజాల ప్లాట్లుగా విడదీసి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు అమ్మేస్తున్నారు. కొన్నేళ్లుగా పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగిపోయింది. మిగిలిన ప్రభుత్వ భూమి 97 ఎకరాలేనని అధికారులుతేల్చారు.
ఎనిమిది నెలలుగా కన్నేశారు: ఎనిమిది నెలలుగా భూకబ్జాదారుల రెచ్చిపోయారు. మిగిలిన 97 ఎకరాల్లో 50 ఎకరాలు అధీనంలోకి తీసుకుని 60 గజాల చొప్పున విభజించారు. చిన్న గుడిసెలు వేసి ఒక్కో స్థలాన్ని రూ.8 లక్షలు.. ఆపైన విక్రయించారు. ఓ పథకం ప్రకారం కబ్జాదారులు రాష్ట్రంలో ఏ పార్ట్టీ అధికారంలో ఉంటే అందులో చేరి స్థానిక నేతల సహకారంతో ఆక్రమణలు కొనసాగించారు. ముందుగా ఆలయాలు నిర్మించి చుట్టూ స్థలాలను పాట్లుచేసి విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు, ఉన్నతాధికారులు ఆదేశించినప్పుడు మాత్రమే నామమాత్రంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారు.
అక్రమార్కుల మాయమాటలు నమ్మి ఇక్కడ ఇళ్లు కట్టుకున్న నిరుపేదలు సమిథలవుతున్నారు. పాతికేళ్లుగా జరిగిన కబ్జాల పర్వం ఒక ఎత్తైతే ఎనిమిది నెలలుగా అక్రమణలు తీరు అధికారులకు సవాల్‌గా మారింది. రెండునెలల కిందట జిల్లా కలెక్టర్ హరీష్ స్వయంగా ఆక్రమణలు పరిశీలించి బాధ్యులపై పీడీ యాక్టు నమోదుకు ఆదేశించారు. ఫెన్సింగ్ ఏర్పాటుచేసి హెచ్‌ఎండీఏకు అప్పగించాలన్నారు. కబ్జాదారులపై కేసులు నమోదు చేయాల్సిఉన్నా రాజకీయ ఒత్తిడితో అధికారులు మిన్నకుండిపోతున్నారు. 329 సర్వే నంబరులో కబ్జాలకు పాల్పడిన ఓ వ్యక్తిపై మూడు కేసులు, 329, 342లో కబ్జాలు చేసిన వ్యక్తిపై ఎనిమిది కేసులు నమోదుచేసినట్లు చెబుతున్నారు. తరువాతా ఆక్రమణలు ఆగడం లేదు.
నేతల బాటలోనే రెవెన్యూ అధికారులు: కొన్ని సార్లు అధికారులపై ఒత్తిడి వస్తే కొన్ని గుడిసెలను ఒక రోజు కూల్చివేసి తరువాత వదిలేస్తున్నారు. కిందిస్థాయిలో కొంతమంది రెవెన్యూ అధికారులు అక్రమాలకు తోడ్పాటు అందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రూ.500 కోట్ల విలువైన 47 ఎకరాల ప్రభుత్వ స్థలం మాత్రమే మిగిలి ఉంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ హరీష్ మరింత కఠినంగా వ్యవహరిస్తేనే ఫలితముంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: