Nacharam ESI Hospital: నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మృతుడి బంధువుల దాడితో ఆస్పత్రిలో విధులకు వెళ్లేందుకు నర్సులు భయపడ్డారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.
బోడుప్పల్‌కు చెందిన నాగేశ్వరరావుకు.. రక్తం తక్కువ ఉందని అతని బంధువులు నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అత్యవసరమని వస్తే కాలయాపన చేశారని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో నిన్న ఉదయం 9 గంటలకు చేర్చిస్తే రాత్రి 11 గంటల వరకు ఎలాంటి వైద్యం అందించలేదని ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
బ్లడ్ తక్కువగా ఉందని ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఎమర్జెన్సీ అని శుక్రవారం ఉదయం వస్తే.. వాళ్లు ఓపీకి రాశారు. అక్కడ నంబర్ ఇచ్చి ఇక్కడే కూచోబెట్టారు. మళ్లీ అడ్మిట్ అయ్యాక కూడా సరిగా పట్టించుకోలేదు. బ్లడ్ తక్కువ ఉందని చెప్పిన మనిషి పట్ల ఇంత నిర్లక్ష్యం చేస్తారా?. అన్ని రకాల పరీక్షలు చేశారు. మళ్లీ సాయంత్రం రక్త పరీక్షలు చేశారు. మధ్యాహ్నం మంచిగానే ఉన్నాడు. అందరితో మాట్లాడారు. చనిపోయే పదిహేను నిమిషాల ముందు కూడా చాలా మంచిగా మాట్లాడారు. అంతలోనే చనిపోయిండు అని చెప్పారు. మరీ ఇంత నిర్లక్ష్యమా? దీనికి కారణమైన వైద్యులు, నర్సులను సస్పెండ్ చేయాలి.
-మృతుడి కుటుంబసభ్యులు
ఇదీ చదవండి: Hyderabad police commissioner CV Anand: హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్