Bandi Sanjay fires on CM KCR: నోటీసుల పేరుతో ప్రచారక్‌ను అవమానిస్తే దేశం చూస్తూ సహించదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. దేశం కోసం పనిచేస్తున్న గొప్ప వ్యక్తిగా బీఎల్ సంతోష్‌ను అభివర్ణించారు. బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. బీఎల్ సంతోష్‌కు ఫామ్‌హౌస్, బ్యాంకు అకౌంట్లు లేవని తెలిపారు. శామీర్‌పేటలో జరిగిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపాను అడ్డుకోలేక అప్రతిష్ఠపాలు చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ది మీద చెప్పే దమ్ములేక కేసీఆర్ పదేపదే కేంద్రాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంగ్రామ యాత్రను కేసీఆర్ అడ్డుకోవాలని చూస్తున్నారన్న ఆయన... ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొవడానికి సిద్దమన్నారు. గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందిస్తామని బండి సంజయ్ తెలిపారు.
'బి.ఎల్.సంతోష్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు. బి.ఎల్.సంతోష్‌కు ఫామ్‌హౌస్, బ్యాంకు అకౌంట్లు లేవు. మా లాంటి కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి బి.ఎల్. సంతోష్. దేశం కోసం పని చేస్తున్న గొప్ప వ్యక్తి బి.ఎల్. సంతోష్. నోటీసుల పేరుతో ప్రచారక్‌ను అవమానిస్తే ఊరుకోం. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందిస్తాం.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఈ నెల 28 నుంచి ఐదో విడత పాదయాత్ర : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 15 లేదా 16 వరకు పాదయాత్ర సాగుతుందని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి బైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్‌లో ముగింపు సభ ఉంటుంది. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఇప్పటికే 4 విడతల్లో పాదయాత్ర చేశారని వీరేందర్‌గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలో 1,178 కి.మీల మేర నడిచినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 26 నుంచి ‘ప్రజాగోస- భాజపా భరోసా యాత్ర’ : ఈ నెల 26వ తేదీ నుంచి ‘ప్రజాగోస- భాజపా భరోసా యాత్ర’ను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేయనున్నారు. ఈ మేరకు బైక్ ర్యాలీలకు సంబంధించిన వివరాలను యాత్ర ఇంఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు వెల్లడించారు. మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూలు, జడ్చర్ల, షాద్‌నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్దన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 200 బైక్‌లతో 10 నుంచి 15 రోజులపాటు బైక్ ర్యాలీలు నిర్వహించడంతో పాటు స్థానిక సమస్యలపై ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి: