మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకుట్లపల్లికి చెందిన దూదేకుల పాషా రెండో కూతురు సోని, లింగన్నోళ్ల లక్ష్మయ్య కుమారుడు యాదగిరి ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలిసింది. మతాలు వేరు కావడం వల్ల ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఏడాది క్రితం సోని, యాదగిరి పోలీసుల జోక్యంతో స్థానిక ఠాణాలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో కాపురం పెట్టారు. కొన్ని రోజుల తర్వాత యాదగిరి భార్యను సరిగ్గా చూసుకోలేదు. అంతేకాకుండా భార్యను ఒంటరిగా అద్దెంటిలో వదిలేసి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన సోని స్వగ్రామం వెళ్లి యాదగిరి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ.. అత్తింటి వారు ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా మీద పడి కొట్టారు. కొన్ని రోజుల తర్వాత ఇరు కుటుంబాల సభ్యులు కొల్చారం మండలం దుంపలకుంట వద్ద రాజీ కుదుర్చుకోవడానికి పంచాయతీ పెట్టారు. మాట్లాడుకుంటుండగా.. మాటా మాటా పెరిగి యాదగిరి తండ్రి అయిన లక్ష్మయ్య మీద దాడి చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడుదామని చెప్పారు.
పోలీసుల ఆదేశాల మేరకు స్వగ్రామం కూకుట్లపల్లికి వచ్చిన యాదగిరి పంచాయతీ కార్యాలయం వద్ద కనిపించిన మామ పాషా మీద కర్రతో దాడి చేశాడు. తలకు బలమైన గాయం తగిలి.. పాషా అక్కడే కుప్పకూలాడు. అక్కడే ఉన్న వారు పాషాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పాషా కుటుంబీకులు గ్రామంలోని యాదగిరి ఇంటిని ధ్వంసం చేసి, ట్రాక్టర్‌కు నిప్పుపెట్టి అతని తండ్రి లక్ష్మయ్యపై దాడి చేశారు.
సమాచారం అందుకున్న తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్, నర్సాపూర్ సీఐ లింగేశ్వర్‌రావు, స్థానిక ఎస్సై రాజశేఖర్ గ్రామానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. యాదగిరి మీద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నర్సాపూర్ సీఐ లింగేశ్వర్‌రావు తెలిపారు.
ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ