మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై.. పోక్సో కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెదక్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశర్లు తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం.. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులందరూ, పోక్సో చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పిల్లలపై అత్యాచారాలు జరుగకుండా చూడాలని ఆదేశించారు.
18 సంవత్సరాల లోపు పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ.. వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులకు ఒక రోజు శిక్షణా తరగతులను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బాలల సంరక్షణ అధికారిణి కరుణ.. తమపై జరిగే అత్యాచారాల గురించి మైనర్లు ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. పిల్లలపై అత్యాచారాలకు పాల్పడినా, మానసిక, శారీరక వేధింపులకు గురి చేసినా.. పోక్సో కింద రూ. లక్ష నుంచి మూడు లక్షల వరకు జరిమానాతో పాటు మూడు సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష ఉంటుందని వివరించారు. పిల్లలకు అధికారులు పోక్సో చట్టం గురించి వివరించి వారికి ధైర్యం చెప్పాలని సూచించారు.
ఇది చదవండి:భాగ్యనగర శివార్లను కమ్మేసిన పొగమంచు..